– జగన్ పై హత్యాయత్నం జరిగితే బాబుకు ఆనందం ఎందుకుంటుంది?
– అన్ని పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి
– ఏ పార్టీతోనైనా కలిసే వెసులుబాటు బాబుకుంది
– చంద్రబాబు మళ్లీ మోదీతో కలిసినా ఆశ్చర్యం లేదు
– ఐటీ దాడుల తర్వాత చంద్రబాబులో మార్పు వచ్చింది
– రాష్ట్రంలో అవినీతి పకడ్బంధీగా జరుగుతోంది
– విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
రాజమండ్రి, నవంబర్2(జనంసాక్షి) : వైసీపీ అధినేత జగన్ పై దాడికి పాల్పడిన శ్రీనివాస్కుకు నార్కోఅనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. అన్నిపార్టీల నేతలు ఈవిషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మాట్లాడుకోవడానికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా… వాటన్నింటినీ వదిలేసి, ఈ దాడిపైనే విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ సభలకు జనాలు బాగా వస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తనపైతానే దాడి చేయించుకోవాల్సిన అవసరం జగన్ కు లేదని ఉండవల్లి అన్నారు. జగన్ కు ఏమైనా జరిగితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసని, కాబట్టి జగన్‌ను హత్య చేయించే పని ఆయన చేయరని చెప్పారు. జగన్ పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబుకు ఆనందం ఎందుకుంటుందని ప్రశ్నించారు. కేసులో నిజాలను పోలీసులు తేలుస్తారని తెలిపారు. నిందితుడికి నార్కో అనాలిసిస్ పరీక్ష చేయిస్తే, వివరాలు బయటకు వస్తాయని చెప్పారు. ఈ విషయంపై అనవసర రాద్ధాంతాన్ని ఆపివేయాలని సూచించారు. దాడి ఘటనపై చంద్రబాబు కూడా అతిగా స్పందించారని విమర్శించారు. ఐటీ దాడుల తర్వాతే చంద్రబాబులో మార్పు వచ్చిందని ఉండవల్లి తెలిపారు. ఆమార్పే టీడీపీకి బద్ధశత్రువైన కాంగ్రెస్ తో కలిసే పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఐటీ దాడుల వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.
దేశంలో ఎవరితోనైనా కలిసే వెసులుబాటు చంద్రబాబుకు ఉందన్న ఉండవల్లి, చంద్రబాబు ఎన్నడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేదని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు మళ్లీ మద్దతు ప్రకటించినా ఆశ్చర్యం లేదని చెప్పారు. పోలవరం అక్రమాలపై తానుచెప్పినవన్నీ జరుగుతున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నాణ్యత లేకుండా, ప్రమాదకరంగా జరుగుతున్నాయని ఉండవల్లి ఆరోపించారు. పోలవరంలో జెట్ గ్రౌటింగ్ పనులు కొట్టుకుపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జెట్ గ్రౌటింగ్ అసలు అంచనాల్లోనే లేదు..ఎంత చెల్లించాలో కూడా తెలియదని చెప్పిందన్నారు. పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్లు ఎంత చెబితే అంత చెల్లించాల్సి ఉంటుందని తెలిపిందన్నారు. పోలవరం విషయంలో బిల్లులు అసలు కంటే ఎక్కువగా చెల్లిస్తున్నారని ముందే చెప్పానని ఉండవల్లి తెలిపారు. అదే విషయం కాగ్ తేల్చిందన్నారు. 2019లో మే నాటికి నీరిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారని, అయితే మేలో నీరుండదన్నారు. నిజాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. అధిక సొమ్ము ఇచ్చి పనిచేయిస్తున్నప్పుడు నాణ్యత విషయంలో ఎందుకు రాజీ పడుతున్నారని ఉండవల్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలన్నీ తాత్కాలికమేనని, శాశ్వత కట్టడం ఒక్కటి కూడా లేదని తెలిపారు. ఆఖరికి హైకోర్టు కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కూడా ఈ తాత్కాలిక భవనాలు నిర్మించేటపుడు టీడీపీని అడగలేదని చెప్పారు. ఇవన్నీ కూడా టీడీపీ, బీజేపీలు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలేనని చెప్పారు. రాజకీయం కూడా ఓ వృత్తిలా మారిపోయాయని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితుడికి నార్కోఅనాలసిస్ పరీక్షలు నిర్వహించాలి




