Tuesday, 3 November 2026

నిమ్జ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

 wz7jz3smతెలంగాణ పారిశ్రామికరంగం ప్రగతిపథంలో దూసుకుపోతోంది. రాష్ట్రంలో అతిపెద్ద పారిశ్రామికవాడగా జాతీయ ఉత్పాదక పెట్టుబడుల మండలి.. నిమ్జ్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేసింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీ పనులకు కూడా కేంద్రం ప్రాథమిక అనుమతులు ఇచ్చింది.

మెదక్‌ జిల్లా జరాసంగం మండలం న్యాల్‌కల్‌ లో 12వేల 700 ఎకరాల్లో నిమ్జ్‌ ఏర్పాటు చేయాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. జాతీయ ఉత్పాదకతను పెంచడంతో పాటు గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో నిమ్జ్‌ ఏర్పాటు కానుంది. 2011 లోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా పనులు మొదలు కాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి చురుగ్గా ఫైళ్లను కదిపింది. డీటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫర్‌ ఫైనల్ అప్రూవల్‌, టెక్నికల్‌ ఎకనామిక్‌ ఫీజిబిలిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. దీనిని పరిశీలించిన కేంద్రం పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది. కాగా ఈ ప్రాజెక్టులో 60 శాతం ఖర్చును కేంద్రం, 40 శాతం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి. కాగా.. ఇప్పటికే 3 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం దీనికోసం సిద్ధంగా ఉంచింది.

ఆటోమొబైల్స్‌, మెటల్‌, ఎలక్రిక్‌ యంత్రాలు, ఎలక్ట్రానిక్‌ హార్డ్ ‌వేర్‌, చేనేత, జౌళి పరిశ్రమలను ఈ పారిశ్రామికవాడలో నెలకొల్పనున్నారు. దీని ద్వారా లక్ష మందికి ప్రత్యక్ష, పది లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరకనుంది. వచ్చే పదేండ్లలో ప్రాజెక్ట్‌ ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. మొదటి దశను రెండేండ్లలోనే పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అటు రంగారెడ్డి ముచ్చెర్లలో 13 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ అధ్వర్యంలోని డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నరసింహారెడ్డి ఫార్మాసిటీ ఏర్పాటుపై కేంద్ర అధికారులకు వివరించారు. దీనిపై సంతృప్తి చెందిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు .. పనులు ప్రారంభించడానికి ప్రాథమిక అనుమతులు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *