Tuesday, 3 November 2026

నిమ్స్‌లో మూడో దశ కోవాక్జిన్‌ పరీక్షలు

ఏర్పాట్లు చేసిన అధికారులు
హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):  నిమ్స్‌ హాస్పిటల్‌లో మరో నాలుగు రోజుల్లో మూడో దశ భారత్‌ బయోటెక్‌ కోవ్యాక్సిన్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఐసీఎంఆర్‌ నుంచి అనుమతులు రావడంతో మూడో దశ పరీక్షలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మంగళవారం నిమ్స్‌ ఎథిక్స్‌ కమిటీ సమావేశం జరుగనుంది. దాదాపుగా 100 నుండి 200 మందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేపట్టారు. డిసెంబర్‌ చివరినాటికి మూడో దశ పూర్తి అవుతుందని అధికారులు అంటున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి తుది అనుమతులు పొంది వ్యాక్సిన్‌ మార్కెట్లోకి వచ్చే ఆస్కారం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇదిలావుంటే  నిమ్స్‌ నర్సెస్‌ యూనియన్‌ సభ్యులు ఆస్పత్రి డైరెక్టర్‌కు శనివారం సమ్మె నోటీస్‌ ఇచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్‌కు సంబంధించిన ఇన్సెంటివ్‌లు, కొవిడ్‌-19 సమయంలో రావాల్సిన ఇన్సెంటివ్‌లు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని ఆ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఆశాలత తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై డైరెక్టర్‌ను ఒకసారి కలిసి బకాయిల గురించి చెప్పామన్నారు. ఎంతో కాలంగా విధులు నిర్వహిస్తున్న నర్సులకు ఏ కారణం లేకుండా పదోన్నతులు ఆపారని వైస్‌
ప్రెసిడెంట్‌ ఎలిజబెత్‌ రాణి అన్నారు.  ఇన్సెంటీవ్‌లు తక్షణమే చెల్లించకుంటే నవంబర్‌ 7వ తేదీ నుంచి సమ్మె నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఆస్పత్రి యాజమాన్య తీరును నిరసిస్తూ శనివారం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరిస్తున్నామన్నారు.