సిద్దిపేట : హుస్నాబాద్ ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం. కరువు ఉన్న ప్రాంతం. నెర్రెలు బారిన నేలలు, నెత్తురు కారిన నేలలు ఇవి.. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కరువును తరిమేసామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రైతు సంక్షేమ పథకాలు అనేకం అమలవుతున్నాయి. కేసీఆర్ కాళేశ్వరం నీళ్లను పైకి మళ్లిస్తున్నాడు అపర భగీరథుడిలా. ఈ ప్రాంతంలో శాశ్వతంగా కరువును తరిమేసాం. కాళేశ్వరం నీళ్లు.. కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, మిడ్ మానేరు వరకు నీళ్లు వస్తున్నాయి. మొత్తంగా ఈ ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలంగా ఉందన్నారు కేటీఆర్. ఒక ప్రాజెక్టుకు కొబ్బరి కాయ కొడితే.. అది పూర్తయ్యే నమ్మకం లేకుండే. కాలువలు తవ్వుతూనే ఉన్నారు. కానీ నీళ్లు రాలేదు. కేసీఆర్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రాజెక్టులు పూర్తి చేసి, గోదావరి నీళ్లను మీ పాదాల వద్దకు తీసుకొచ్చారని కేటీఆర్ తెలిపారు. ఒకప్పుడు కరెంట్ కోసం గోస పడ్డాం. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 9 గంటల కరెంట్ అని నరికి 6 గంటల కరెంట్ ఇచ్చారు. అది కూడా సక్కగా ఇవ్వని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ వస్తే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆడబిడ్డల నీటి కష్టాలను తీర్చింది కేసీఆర్ మాత్రమే..
ఇవాళ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశామని కేటీఆర్ తెలిపారు. అక్కడకు వచ్చిన ఆడబిడ్డలను నీళ్లు వస్తున్నాయా? అని అడిగాను. బంజారాహిల్స్‌లో ఎలాగైతే నీల్లు వస్తున్నాయో.. మా బంజారా తండాల్లో కూడా అలాగే నీళ్లు వస్తున్నాయని చెప్పారు. మా తండాల్లో మా రాజ్యం తీసుకొచ్చారు. హుస్నాబాద్‌లో 11 తండాలను గ్రామపంచాయతీలు చేశారని ఆ ఆడబిడ్డలు చెప్పారని కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాక ముందు ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు గ్రామాల్లోకి వచ్చేందుకు భయపడేవారు. ఇవాళ మాత్రం ప్రతి ప్రజాప్రతినిధి గ్రామాల్లోకి వస్తున్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా 75 ఏండ్ల తర్వాత కేసీఆర్ ఆడబిడ్డల కష్టాలను తీర్చారు. ఇంటింటికీ మంచినీళ్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు కేటీఆర్.




