హైదరాబాద్: పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని చెప్పారు. అటవీ భూములపై ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటే 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామన్నారు. గుత్తికోయలను తీసుకువచ్చి అడవులను నరికివేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అటవీ అధికారులపై దాడులు సరికాదన్నారు. గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసన్నారు. పోడుభూములపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేశారు. పోడుభూములపై ప్రతిసారి రాజకీయం చేయడం సరికాదని ముఖ్యమంత్రి సూచించారు. పోడు భూములు అనేవి హక్కు కాదు… దురాక్రమణ అని స్పష్టం చేశారు. విచక్షణారహితంగా అడవులను నరికేయడం సరికాదన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. పోడు, అటవీ భూములు పలువురికి ఆటవస్తువులా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజనులపై దౌర్జన్యం జరుగకుండా చూడాలని సూచించారు. కొందరు అగ్ర కులస్థులు గిరిజన యువతులను పెండ్లి చేసుకుంటున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పలువురు ఉన్నత కులాలవారు అటవీ భూములను కబ్జాచేశారన్నారు. 10, 20 ఎకరాల పోడు భూములు ఎవరికైనా ఉంటాయా అని ప్రశ్నించారు.
గిరిజనుల హక్కులు కాపాడాల్సిందే..
గిరిజనుల హక్కులు కాపాడాల్సిందేనని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. పోడుభూముల దురాక్రమణ జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా, కనుమరుగు కావాలా అని ప్రశ్నించారు. నర్సాపూర్ అడవి ఎలా ఎడారైందో మనమంతా చూశామన్నారు. అడవుల పునరజ్జీవనం చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో 7.8 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు.దళితబంధు తరహాలోనే గిరిజన బంధుపోడు భూముల విషయంలో తమకు స్పష్టత ఉందన్నారు. పోడు భూముల సర్వే పూర్తయిందని వెల్లడించారు. ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు సాగుచేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామని వెల్లడించారు. అయితే భూములు తీసుకున్న గిరిజనులు ఇకనుంచి పోడు భూములను రక్షిస్తామని హామీ ఇవ్వాలన్నారు. చెట్లు నరకబోమని సంతకాలు పెడితేనే భూములు పంచుతామని చెప్పారు. తీర్మానానికి ముందుకురాని గ్రామాలకు పట్టాలిచ్చేది లేదన్నారు. భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని, పట్టాలను రద్దుచేస్తామని స్పష్టం చేశారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామన్నారు.




