మంచిర్యాలలో ప్రారంభం.19న వర్దన్నపేటలో ముగింపు
యాత్రలో రైతుబంధు లొసుగులు ఎండగడతాం: ఉత్తమ్
హైదరాబాద్,మే12(జనం సాక్షి ): కాంగ్రెస్ మలివిడత బస్సుయాత్ర ఆదివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు పిసిసి ఏర్పాట్లు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చేపట్టిన ప్రజాచైతన్య బస్సు యాత్ర మూడో విడత ఆదివారం మంచిర్యాలలో ప్రారంభం కానుంది. ఇది వరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బస్సుయాత్రను 13న ప్రారంభించి 17న బెల్లంపల్లిలో ముగించాలని నిర్ణయించారు. కానీ తాజాగా 19న వర్దన్నపేటలో జరిగే బహిరంగ సభతో ముగించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 13న మంచిర్యాలలో, 14న చెన్నూరు, 15న సిర్పూర్ కాగజ్‌నగర్, 16న ఆసిఫాబాద్, 17న బెల్లంపల్లి, 18న వరంగల్ తూర్పు, 19న వర్దన్నపేటలో బస్సుయాత్ర కొనసాగుతుంది. తొలి రెండు విడతల్లో భాగంగా ఇప్పటికే 31 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బస్సుయాత్ర పూర్తి చేసినట్లు ఉత్తమ్ తెలిపారు. అధిక సంఖ్యలో తరలివచ్చి మూడో విడత బస్సుయాత్రనూ విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ఎన్నికల స్టంట్ అని, ఆ పథకం లోగుట్టును బస్సు యాత్రలో ప్రజలకు వివరిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నుంచి చేపట్టనున్న మూడో విడత బస్సుయాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కనీసం పరామర్శించలేదని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా రైతులను అన్నివిధాలా మోసం చేసి ఎన్నికలు సవిూపిస్తున్న వేళ కంటి తుడుపు చర్యగా రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఎకరాకు రూ.4వేల సాయం ఉపశమన పథకం మాత్రమేనని, ఇలాంటి వాటితో ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల ఎత్తు, లావు గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతుండటం.. ఆయన వాదనలో పస లేదనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో అనేకమంది చేరడానికి ఉత్సాహంగా ఉన్నారని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.
—–
నేటినుంచి కాంగ్రెస్ మూడోదశ బస్సు యాత్ర




