Monday, 2 November 2026

నేటినుంచి స్కూళ్ల పునఃప్రారంభం

2న తెలంగాణ అవతరణ వేడుకలు
జూన్‌ 4 నుంచి 8 వరకు బడిబాట
పాఠశాలలకు ముందే చేరిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌
బయోమెట్రిక్‌ అమలుతో టీచర్లు, స్టూడెంట్స్‌ హాజరు పరిశీలన
హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి): వేసవి సెలవుల అనంతరం జూన్‌ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాసంవత్సరాన్ని ప్రభుత్వం ముందుకు జరిపింది. గతంలో జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేవి. జూన్‌2న అవతరణ వేడుకల సందర్బంగా పాఠశాలలను జూన్‌1 తెరవబోతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించడానికి ముందు రోజు పాఠశాలలను ముస్తాబు చేయనున్నారు. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఎగురవేసి అవతరణ దినోత్సవ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించనున్నారు. జూన్‌ 4 నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించ నున్నారు. ఈ సారి 9,10వ తరగతి విద్యార్థులకు కూడా యూనిఫామ్స్‌ అందించనున్నట్లు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. గత ఏడాది జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభం కాగా ఈ సారి జూన్‌ 1 నుంచే ప్రారంభం అవుతుండడంతో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. పాఠశాలల పునఃప్రారంభం ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించేలా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, 2 జతల యూనిఫామ్స్‌ను అందించనున్నారు. ఆయా గ్రామాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు కలిసి ఆయా పాఠశాలల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ రోజు ఒక పండుగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభించి విద్యార్థులకు నిమ్మరసం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే పాఠశాలలను శుద్ధి చేసి మామిడి తోరణాలు, అరటి ఆకులు కట్టి పాఠశాలలను అలంకరణ కార్యక్రమాలు చేపట్టారు. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలను పురస్కరించుకొని ప్రతి పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఆవశ్యకతను విద్యార్థులకు వివరిస్తారు. 4 నుంచి 8 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చేరిక పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఉపాధ్యాయులంతా గ్రామంలో ఇంటింటికీ తిరిగి అడ్మిషన్లు చేసుకుంటారు. విద్యాబోధనను వివరిస్తూ బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పిస్తారు. ఇప్పటికే జిల్లాల్లో పలు మండలాల్లో ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడానికి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన, వసతులు తదితర అంశాలపై ప్రచారం నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.  ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు గ్రామంలోని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని  అన్నారు. ప్రభుత్వం సర్కార్‌ బడులను బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఇకపోతే గతానుభవానలు దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ముందుగానే పాఠశాలలు ప్రారంభం కానుండడంతో ప్రభుత్వం ఇప్పటికే అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ను పంపిణీ చేసింది. పాఠశాలలు ప్రారంభం నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ అందజేయాలనే లక్ష్యంతో ముందుగానే పంపిణీ చేసింది. డివిజన్‌ కేంద్రాల వారీగా విభజన చేసి ఆయా మండల కేంద్రాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను, యూనిఫామ్స్‌ను పంపిణీ చేశారు. 1 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు 2 జతల దుస్తులను అందిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 9, 10వ తరగతి విద్యార్థులకు కూడా యూనిఫామ్స్‌ అందిస్తామని ఇటీవల ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు.అయితే 4వ తేదీ నుంచి 8 వరకు ఒంటిపూట బడి, ఉదయం 7 గంటల నుంచి 11 వరకే పాఠశాలలు ఉంటాయి. గ్రేటర్‌ పరిధిలోని 3 వేల పాఠశాలలు తెరుచుకోనున్నాయి. సుమారు 15 లక్షల మంది పిల్లలు స్కూల్‌ కోసం రోడ్డెక్కనున్నారు. వీరి కోసం మరో 8 వేలకు పైగా స్కూల్‌ బస్సులు, మరో 40 వేల ఆటోలు సైతం రోడ్డు విూదికి రానున్నాయి. రెండు నెలల పాటు ట్రాఫిక్‌లో కాస్త ఉపశమనాన్ని పొందిన నగరం రేపటి నుంచి పద్మవ్యూహాన్ని తలపించనుంది.
ప్రభుత్వ స్కూళ్లల్లో బయోమెట్రిక్‌
విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బయో మెట్రిక్‌ హాజరును అమలు చేయబోతున్నారు. ఇందుకోసం బయోమెట్రిక్‌ పరికరాలను పాఠశాలల్లో అమర్చబోతున్నారు. గతేడాదే బయోమెట్రిక్‌ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించినా.. కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది కచ్చితంగా అమలుచేసి తీరాలన్న ఆలోచనతో ఉన్న విద్యాశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. అన్ని స్కూళ్లల్లో బయోమెట్రిక్‌ పరికరాలను అమర్చడం కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల హాజరును సైతం బయోమెట్రిక్‌లో నమోదు చేయనున్నారు. ఉపాధ్యాయుల హాజరుశాతాన్ని పెంచడం, గైర్హాజరీని తగ్గిం చడం కోసం బయోమెట్రిక్‌ హాజరును అమలుపరచబోతున్నారు. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజు నుంచే మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించనున్నారు.
యానిఫామ్స్‌ పంపిణీకి రంగం సిద్దం
విద్యార్థులకు యూనిఫామ్‌లు అందజేసే పక్రియ పురోగతి దిశలో సాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎయిడెడ్‌ వారికీ యూనిఫామ్‌ అందజేయడానికి సర్వశిక్షా అభియాన్‌ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. విద్యార్థులకు యూనిఫామ్‌లు  ఎంత అవసరమన్న  ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున 2 లక్షల 14 వేలు యూనిఫామ్‌లు ఒక్కో జిల్లాకు అవసరం. అయితే స్కూల్‌ ప్రారంభ రోజునే ఒక్కో విద్యార్థికి ఒక జత పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరో జతను స్కూల్‌ ప్రారంభమైన నెల రోజుల లోపే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
—————