– కాకినాడలో 7 నియోజకవర్గాల్లో సభలు
– జనసేన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల
హైదరాబాద్, నవంబర్1(జనంసాక్షి) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ జనసేన సమన్వయ కమిటీలను నియమించడంతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. తాజాగా ఆయన శుక్రవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన కార్యాలయం గురువారం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకూ పవన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా కాకినాడలోని ఏడు నియోజకవర్గాల్లో పవన్ యాత్ర సాగనుంది. జనసేన కేడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా పవన్ యాత్ర చేపట్టనున్నారు. పర్యటనలో భాగంగా ప్రజలతో పవన్ ముఖాముఖి సమావేశం అవుతారు. శుక్రవారం ఉదయం విజయవాడలోని జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అన్నవరం, సామర్లకోట విూదుగా పవన్ తునికి చేరుకుంటారు. తొలిరోజు తునిలోని గొల్ల అప్పారావు సెంటర్ లో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు. నియోజకవర్గాల్లో పర్యటన సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకుంటారు. ఇదిలా ఉంటే నేడు జరిగే పవన్ సభపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తినెలకొంది. ఇటీవల జగన్‌పై కోడికత్తితో దాడి జరిగిన ఘటన నేపథ్యంలో దాడిని పవన్ ఖండించారు. కాగా టీడీపీ నేతలు పవన్ తీరుపై మాటలదాడికి దిగారు. చంద్రబాబు సైతం పవన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో వీటన్నింటిని నేడు జరిగే తన పర్యటనలో పవన్మాట్లాడుతారని అందరూ భావిస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ నేతల వ్యాఖ్యలు, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై పవన్ ఏ విధంగా స్పందిస్తారని ఏపీ రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.




