హాజరుకానున్న సోనియా,రాహుల్
భారీగా జనసవిూకరణపై కాంగ్రెస్ నేతల దృష్టి
రెబల్స్‌ను దారికితీసుకొచ్చే యత్నంలో నేతలు
ఫ్రెండ్లీ పోటీలకు పుల్‌స్టాప్ పెట్టాలన్న కోదండరామ్
హైదరాబాద్,నవంబర్22(జనంసాక్షి): సీట్ల పంచాయితీ తెగకున్న కాంగ్రెస్ తొలి ఎన్నికల సభకు సిద్దం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం మేడ్చల్‌లో జరిగే కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. వీరు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా 5.30గంటలకు మేడ్చల్ సభాస్థలికి చేరుకుంటారు. కాగా… సభ వద్ద రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల కోసం ఒకటి, అభ్యర్ధుల కోసం మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాహుల్ ప్రసంగం మొత్తం 10లక్షల మందికి చేరేలా ఏర్పాట్లు చేస్తుండగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎల్‌ఈడీలను ఏర్పాటుచేసి కనీస 5వేల మందికి తగ్గకుండా ఎల్‌ఈడీల వద్ద కూర్చోబెట్టాలని టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భారీగా జనసవిూకరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే రెబెల్స్ వ్యవహారం తేలేలా లేదు. కొన్నిచోట్ల వీరు ససేమిరా అంటున్నారు. అలాగే పొత్తు ధర్మం విస్మరించి కావాలనే కొన్నిచోట్ల కాంగ్రెస్ కూడా అభ్యర్థులను నిలబెట్టింది. దీనిపై టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కూడా గట్టిగానే హెచ్చరించారు. వెంటనే పోటీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని అల్టిమేటమ్ ఇచ్చారు. మహాకూటమి భాగస్వామ్య పక్షాల తరఫున ప్రతి నియోజకవర్గంలోనూ ఒక పార్టీ అభ్యర్థి మాత్రమే బరిలో ఉండేలా చూడాలని కాంగ్రెస్ అగ్రనేతలను టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. ఫ్రెండ్లీ పోటీలనేవి ఉండకుండా చూడాలన్నారు. అప్పుడే కాంగ్రెస్‌పై బరిలో నిలిపిన తమ అభ్యర్థులను కూడా పోటీలో నుంచి ఉపసంహరింపజేయిస్తామని ప్రతిపాదించారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలకు ఆయన సూటిగానే చెప్పారని టీజేఎస్ వర్గాలు తెలిపాయి. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకే ఉమ్మడిగా పనిచేస్తున్నామని, ఈ నేపథ్యంలో… ఫ్రెండ్లీ పోటీలు కూటమి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీజేఎస్ అభ్యర్థులిద్దరూ పోటీలో ఉండటంతో ఏ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయాలో తెలియడంలేదని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. ఈ సందిగ్ధత కారణంగా వరంగల్, మెదక్‌తోపాటు ఇతర జిల్లాల్లో ప్రచారం నిలిచిపోయిందని ఆమె పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. సోనియా సభ జరుగుతన్న వేళ ఇంకా ఇలాంటి వ్యవహారాలు ఉండరాదని అంతా కోరుకుంటున్నారు.




