– భన్వర్ లాల్
వరంగల్ నవంబర్20(జనంసాక్షి):
వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు. రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. రేపు (శనివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని భన్వర్ లాల్ ప్రకటించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రం దగ్గర లైన్లో నిలుచున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు.ప్రతీ పోలింగ్ కేంద్రంలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు భన్వర్ లాల్ వెల్లడించారు. ఇందుకోసం 800 మంది విద్యార్థులు పని చేస్తారని చెప్పారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు బల్క్ ఎస్‌ఎంఎస్ లపై నిషేధం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని భన్వర్ లాల్ కోరారు.పోలింగ్ కేంద్రానికి వచ్చిన తొలి ఓటరుకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతామని భన్వర్ లాల్ చెప్పారు. ఇప్పటి వరకు 96 శాతం ఓటర్ స్లిప్ ల పంపిణీ జరిగిందని తెలిపారు. గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 4252 2747 ను ఏర్పాటు చేశామని భన్వర్ లాల్ వెల్లడించారు. ఎవరైనా ఈ నంబరుకు ఫోన్ చేయొచ్చన్నారు. ఇప్పటి వరకు టోల్ ఫ్రీ నంబరుకు 52 ఫిర్యాదులు రాగా, వాటిలో డబ్బు పంపిణీకి సంబంధించి 11, మద్యం పంపిణీకి సంబంధించినవి 6 ఉన్నాయన్నారు. 5 వేల లీటర్ల మద్యం సీజ్ చేసినమని భన్వర్ లాల్ వివరించారు.వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులున్నారు. 15 లక్షల 9 వేల 671 మంది ఓటర్లకు 1,778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. బందోబస్తుకు 20 కంపెనీల పారా మిలిటరీ, కేంద్ర బలగాలను మోహరించారు.
వరంగల్ లోక్‌సభ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా చేపట్టారు.ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. శనివారం జరుగనున్న ఎన్నిక కారణంగా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా భారీ బందోబస్తుతో పాటు, సిసి కెమెరాల నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఈవీఎంలు పోలీంగ్ సిబ్బందికి అధికారులు అందజేశారు. ఇవిఎంలతో పాటు సరంజామాతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రస్తుత కడిప్యూటి సిఎం కడియం శ్రీహరి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. మొత్తం నాలుగు పార్టీల అభ్యర్థులు ప్రధానంగా బరిలో నిలిచారు. అధికార టిఆర్‌ఎస్ నుంచి పసునూరి దయాకర్, టిడిపి-బిజెపి కూటమి అభ్యర్థిగా ఎన్‌ఆర్‌ఐ రంగంలో ఉన్నారు. ఇక వైకాపా నుంచి నల్లా సూర్యప్రకాశ్, లెఫ్ట్ పార్టీల నుంచి గాలి వినోద్ కుమార్ పోటీ పడుతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజవర్గాల పరిధిలో 15,96071 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం జిల్లాలో 1,778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు.
ఇందుకోసం 8వేల 160 మంది సిబ్బందిని నియమించారు. ఎన్నికల సిబ్బంది సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు బయలు దేరారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగేందుకు 738 మంది అబ్జర్వర్లను నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్, వెబ్ కెమెరాల ద్వారా పోలింగ్ ప్రకియ పర్యవేక్షణ చేస్తున్నారు. 200 మంది పోలింగ్ సిబ్బంది ఎలక్షన్ విధులను నిర్వహించనున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు 20 పారామిలిటరీ దళాలను దించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో నూతనంగా రెండు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులకు చెందిన ఫోటోలు ఉంచనున్నారు. అలాగే తొలిసారిగా పోలింగ్ కేంద్రానికి వచ్చి మొదటి ఓటు వేసిన వ్యక్తిని పుష్పగుచ్చంతో స్వాగతం పలకనున్నారు. గత ఎన్నికల్లో 76శాతానికి పైగా పోలింగ్ నమోదు అయిన నేపథ్యంలో ఈసారి కూడా అంతేస్థాయిలో పోలింగ్ శాతాన్ని నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ కరుణతో పాటు జాయింట్ కలెక్టర్, ఆర్డీవో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూపాలపల్లి, పరకాలలో 35 సంస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పోలింగ్ పక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్‌కు 5,500 సిబ్బంది: కలెక్టర్ కరుణ ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. . ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. పోలింగ్ నిర్వహణ కోసం 5,500 సిబ్బందిని ఏర్పాటు చేశామని, అదనంగా 2వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచామన్నారు. భద్రత కోసం 20 కంపెనీల పారా మిలటరీ బలగాలు మోహరించినట్లు చెప్పారు.





