పాఠ్యంశంగా ఆయన జీవిత చరిత్ర
మండలిలో నివాళి అర్పించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్,సెప్టెంబర్ 27(జనంసాక్షి): గొప్ప మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మృతిపట్ల రాష్ట్ర శాసనమండలి సంతాపం వ్యక్తం చేసింది. నేరెళ్ల వేణుమాధవ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ మండలిలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడారు. నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఒక పాఠ్యాంశంగా కూడా ఆయన జీవిత చరిత్రను పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నేరెళ్ల వేణుమాధవ్ విశ్వవిఖ్యాత కళాకారుడు. తెలంగాణ ముద్దుబిడ్డ. మిమిక్రీ కళను విశ్వవ్యాప్తం చేసిన ఘనత నేరెళ్లదే అన్నారు. మిమిక్రీ కళా చరిత్రలో వేణుమాధవ్ ముందు.. వేణుమాధవ్ తర్వాత అని చెప్పుకోవాలి. వేణుమాధవ్‌కు ధ్వన్యనుకరణ సామ్రాట్ అని పేరు. ఇందిరాగాంధీ గొంతు అనుకరిస్తే ఆమె మాట్లాడుతోందా అనిపించేది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె లాంటి కవులు తమ పుస్తకాలను వేణుమాధవ్‌కు అంకితమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నేరెళ్లను వేణుమాధవ్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని సీఎం తెలిపారు. నేరెళ్ల వేణుమాధవ్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నేరెళ్ల పేరువిూద అవార్డు




