పండ్లతోటలకు వరుస ఎదురుదెబ్బలు

ఎండలు..అకాల వర్షాలతో సర్వం నష్టం
కడప,మే5(జ‌నం సాక్షి ): ఎండల తీవ్రతతో ప్రజలు అల్లాడుతుంటే పండ్ల తోటలకు నీరందక ఎండిపోతున్నాయి. ప్రధానంగా వర్షాధారంతో సాగు చేసిన పలు తోటలు నీరందక ఎండిపోయే దుస్థితి నెలకొంది.  దీంతో దీర్ఘకాలిక పంటలైన అరటి, బొప్పాయి సపోటా, పనస, జామ, నిమ్మ పంటలు ఎండిపోతున్నాయి. ఈ పంటలకు సాగునీరు అందక రైతులు అల్లాడుతున్నారు. తోటల్లో ఆశించిన మేరా దిగుబడి ఉన్నప్పటికీ నీరు అందక పోవడంతో దిగుబడి వున్న అరటి చెట్లు ప్రస్తుతం వీస్తున్న గాలులకు నేలకూరుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో గాలివాన బీభత్సం కారణంగా ఉన్న తోటలు నేలమట్టం అయ్యాయి. ఓ వైపు ఎండలతో బాధపడితే మొత్తానికే మోసం వచ్చిందని రైతులు వాపోతున్నారు. వివిధ ప్రాంతాల్లో సాగుచేసిన పండ్ల తోటల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గతంలో కురిసిన వర్షాలతో దీర్ఘకాలిక పంటలను రైతులు సాగుచేసారు. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో భూగర్బ జలాలు అడుగంటిపోయి నీరు అడుగంటి పోయింది.ఆధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమని రైతులు వాపోతున్నారు. వేల హెక్టార్లలో అరటి, బొప్పాయి సాగులో ఉన్నట్లు ఆధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే నీటి కొరత కారణంగా వందల హెక్టర్లలో అరటి, బొప్పాయి తోటలు నిలువున్నా ఎండి పోయాయని రైతులు ఆందోళన చెందుతుతున్నారు. తోటలను కాపాడుకు నేందుకు  బోర్లు వేసినా భూగర్బంలో తేమకూడా బయటకు రాలేదన్నారు. ఈ దశలో కురిసిన అకాల వర్షాలతో అనేకచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.

 

తాజావార్తలు