పక్కాగా ధాన్యం సేకరణ
మహబూబ్‌నగర్,అక్టోబర్26(జనంసాక్షి): గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేశామని డీఆర్‌డీఏ మార్కెటింగ్ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అవసరమై మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. జూరాల ప్రాజెక్టు కింద, నీటి వనరులు లభించిన ప్రాంతాల్లో వరి పంటను రైతులు అధికంగా వేశారని ఆ ప్రాంతంలో ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా నుంచి అత్యధికంగా వరిపంట ఎక్కువ వస్తోంది. అందుకోసం అక్కడ అత్యధికంగా ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహిళా సంఘాలను గుర్తించి వారికి సలహాలను, సూచనలను అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు, సంఘాలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు. రైతులు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. అధికారులు సూచించిన మేరకు తేమలేకుండా ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకునిరావాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించినా.. రైతుల వద్ద నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణిస్తూ సేకరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది కూడా అన్ని వివరాలను ఇంటర్‌నెట్‌తో అనుసంధానం చేసి మహిళాసంఘాలకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారీ వరి ధాన్యాన్ని సేకరించే బాధ్యత
మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. కష్టించి పండించిన పంటలకు రైతులకు మంచి గిట్టుబాటు ధరను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వమే మహిళా సంఘాల చేత కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం పేరు, మహిళా సంఘం వివరాలు, ఏర్పాటు చేసిన ప్రాంతం, కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతు పేరు, పండించిన పంట పేరు, ఎన్ని కింటాళ్ల ధాన్యాన్ని అమ్మారు, వాటికి ధర, అతని బ్యాంకు ఖాతా, చెక్కును అందించే అన్నిరకాల వివరాలను నెట్‌లో నమోదు చేయడం వల్ల్ మోసాలకు అవకాశం ఉండదన్నారు.