నాలుగేళ్లుగా హరితహారంలో ముందు
గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్‌లో అజయ్ మిశ్రా
హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): గ్రీన్ బిల్డింగ్ ఎన్వీరాన్‌మెంట్‌లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మోడల్ స్టేట్ గా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా తెలిపారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్.ఐ.సి.సి లో జరుగుతున్న గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 16వ ఎడిషన్ కర్టైన్ రైజర్ కార్యక్రమానికి అజయ్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా గ్రీన్ తెలంగాణ కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, అందులో భాగంగా హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వంద కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రావిూణ ప్రాంతాల్లో హరితహారం పైన, సోలార్ సిస్టం పట్ల అవగాహన కలిపిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సోలార్ పార్క్ లను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 3400 మెగావాట్ల సోలార్ ఎనర్జీని అందుబాటులోకి తెచ్చామన్నారు. అనంతరం లీడర్ షిప్ ఇన్ గ్రీన్ బిల్డింగ్ కేటగిరీలో ఏషియా ఫెసిఫిక్ అవార్డులు అందజేశారు. తెలంగాణ ఫారెస్ట్ శాఖకు సంబంధించి కొండాపూర్ బొటానికల్ గార్డెన్‌కు, ఆర్గానిక్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన నాంది ఆర్గానిక్ ఫాంకు, మోహాలిలో ఉన్న ఐఎస్‌బీకి ఈ అవార్డులు దక్కాయి. ఈ సదస్సు నాలుగు రోజుల పాటు జరుగనున్నదని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ చైర్మన్ సురేష్, తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




