Wednesday, 4 November 2026

పట్టణాలే దేశానికి ఆర్థిక వనరులు

– ప్రణాళిక ప్రకారం పట్టణాభివృద్ధి జరగాలి
– తెలంగాణ జీఎస్‌డీపీలో 50శాతం పట్టణాల నుంచే
– 2023నాటికి తెలంగాణ పట్టణజనాభా 50 శాతం దాటుతుంది
– పట్టణాలను కాపాడుకోకపోతే ఆర్థిక వ్యవస్థకే ఇబ్బంది కలుగుతుంది
– పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌
– మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ వార్షిక నివేదికను విడుదలచేసిన మంత్రి
హైదరాబాద్‌, జులై25(జ‌నంసాక్షి) : భారతదేశానికి పట్టణాలే ఆర్థిక వనరులుగా ఉన్నాయని,  పురపాలక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నగరంలోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్‌ బుధవారం విడుదల చేశారు. తొలిసారి పురపాలక శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. అనంతరం మెట్రో, వాటర్‌వర్క్స్‌ శాఖల ప్రోగ్రెస్‌ రిపోర్టులను కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్న క్రమంలో మున్సిపల్‌ శాఖకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పురపాలక శాఖలో 15 మంది ఐఏఎస్‌ అధికారులు ఉన్నారని చెప్పారు. మెరుగైన జీవన ప్రమాణాల కోసం గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు వలస పోతున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ జీఎస్‌డీపీలో 45 నుంచి 50 శాతం పట్టణాల నుంచే వస్తుందని తెలిపారు. పట్టణాభివృద్ధి ప్రణాళికబద్ధంగా జరగాలని అధికారులకు కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయన్నారు. 2023 నాటికి తెలంగాణ పట్టణ జనాభా 50 శాతం దాటబోతుందని కేటీఆర్‌ తెలిపారు. పట్టణాలను కాపాడుకోకపోతే ఆర్థిక వ్యవస్థకే ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. జనసాంద్రత పెరిగినప్పుడు మౌలిక వసతుల్లో ఇబ్బంది కలుగుతుందని కేటీఆర్‌ చెప్పారు. ప్రణాళికబద్దమైన పట్టణాభివృద్ధి లేకపోతే మన నగరాలే మనకు శాపంగా మారుతాయన్నారు. పట్టణాల అభివృద్ధి ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలని, తద్వారా మంచి వసతులతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని పలు పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయన్నారు. రోడ్ల విస్తరణ, పార్క్‌ లు, ఇతర వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, తద్వారా పట్టణ ప్రజలు సంతోషంగా జీవనం సాగించే వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ , కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, హైదరాబాద్‌ కలెక్టర్‌, ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు.