ఇండోనేషియాలో మరో విమానం ఘోర ప్రమాదానికి గురైంది. పపువాలోని పర్వత శ్రేణుల్లో త్రిగణ ఎయిర్ సర్వీస్‌కు చెందిన ఏటీఆర్42-300 విమానం కూలిపోయినట్లు ఇండోనేషియా ప్రకటించింది. ప్రమాద సమయంలో విమానంలో 54 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు సిబ్బంది కాగా 49 మంది ప్రయాణీకులు. ఈ ప్రమాదంలో వీరంతా దుర్మరణం చెంది ఉంటారని సమాచారం.
పపువా రాజధాని జయపుర నుంచి 2.22 గంటలకు టేకాఫ్ అయిన విమానం 3.16 గంటలకు ఒకాసిబిల్కు చేరుకోవాల్సి ఉంది. మధ్యమార్గంలో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలని విమాన సిబ్బంది కోరారు.ఇంకా పది నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటుందనగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఏటీఆర్42-300 విమాన ఆచూకీ కోసం మరో త్రిగణ సర్వీస్‌కు చెందిన విమానాన్ని పంపించారని.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అన్వేషణ సాధ్యపడలేదని ఇండోనేషియా రవాణాశాఖ అధికార ప్రతినిధి జూలియస్ బరాటా పేర్కొన్నారు. పపువాలోని ఒక్బాపే జిల్లాలోని గ్రామస్థులు విమానం కూలిపోవడాన్ని తాము చూశామని చెప్తున్నారు.
ఏటీఆర్ 42-300 విమానం 27 ఏండ్ల పురాతనమైనదని ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ తెలిపింది. ఇటలీ విమాన తయారీ కంపెనీ ఫిన్మెక్కానికా, ఎయిర్‌బస్, అలెనియా ఎయిర్మచ్చి జాయింట్ వెంచర్లో ఏటీఆర్ విమానాలు తయారయ్యాయని తెలిపింది. 2007 నుంచి యూరోపియన్ యూనియన్ నిషేధించిన జాబితాలో త్రిగణ ఎయిర్‌లైన్స్ కూడా ఉంది. ఇటీవలీ కాలంలో విమాన ప్రమాదాలు ఇండోనేషియాను పెద్ద ఎత్తున వెంటాడుతున్నాయి.గత రెండేండ్లలో త్రిగణ ఎయిర్ సర్వీస్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురికావడం ఇది మూడోది కాగా.. 1991 నుంచి పద్నాలుగోది.
అర్హత ఉన్న పైలట్లు, మెకానిక్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కొరత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఎయిర్పోర్ట్ టెక్నాలజీ అందుబాటులో లేవన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తాజా విమాన ప్రమాదం ఇండోనేషియా పౌర విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
పపువాలో కుప్పకూలిన విమానం




