Wednesday, 4 November 2026

పర్యావరణ విధ్వంసం ఇకనైనా ఆపాలి

తక్షణ రక్షణ చర్యలు తీసుకోకుంటే మనగుడకు ప్రమాదం

హైదరాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి): పర్యావరణ కాలుష్యంతో ప్రకృతి జీవనాడులు పట్టుదప్పుతున్నాయి. పల్లెలకు జీవకళ తప్పింది. ప్రకృతిని చూసే విధానంలో మార్పు రావొచ్చు కానీ… ప్రకృతి మాత్రం మారదు. అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వంసం ఆపసకపోతే పల్లెల స్వరూపమే మారుతుంది. ఈ విధ్వంసక ప్రయత్నాలు శతాబ్దాలుగా జరుగుతూనే వున్నా ఇటీవల కాలంలో మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పర్యావరణ సమస్య తీవ్రరూపం దాల్చింది. మానవాళి ప్రశాంతంగా జీవించాలంటే ప్రకృతి, పర్యావరణం సజావుగా ఉండాలి. దీనికి విరుద్ధంగా సాగించే ప్రయాణం మనిషి మనుగడకు, అస్తిత్వానికి పెనుసవాలుగా మారనుంది. అభివృద్ధి పేరిట ప్రకృతి గుండెల్లో చిచ్చు పెట్టే ధోరణిని అడ్డుకోవాలి. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లను, అడవులను నిర్మూలిస్తున్నారు. తద్వారా పర్యావరణం ముప్పుకు భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితిని పాలకులే కల్పిస్తున్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌తో పాటు ఇతర నిపుణుల సూచనలను కాదని యథేచ్ఛగా కొనసాగుతోన్న పర్యావరణ విచ్ఛిత్తిని అడ్డుకోవాల్సింది ప్రజలే. ఇబ్బడిముబ్బడిగా ఎరువుల వాడకం వల్ల చినుకు రాలంగానే పరవశించాల్సిన భూమి… మనిషి వినాశకర విధానాల వల్ల ఉష్ణతాపంతో వేడెక్కిపోతోంది.అందుకే భూమి వేడెక్కింది. సారాన్ని కోల్పోయింది. సముద్రాల, నదుల, పర్వతాల, అడవుల ఉనికికి ముప్పుగా పరిణమించే విధానాల్ని అనుసరించడం వల్ల మనం ముప్పును ఎదుర్కోవడమే గాకుండా భవిష్యత్‌ తరాలకు వారసత్వంగా అందిస్తున్నాం. భూతాపం పెరగడానికి కారణమైన ఈ విధానాల పర్యవసానాలు రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. రసాయన ఎరువులు, విమానాలు విడుదల చేసే వాయువులు, అంతరిస్తున్న అడవులు- వెరసి ఓజోన్‌ పొరను బలహీనం చేస్తున్నాయి. ప్రకృతికీ, మానవాళికీ క్షేమకరంగా ఉండే ప్రత్యామ్నాయాల వైపు ప్రయాణించడం మన తక్షణావసరం. వర్తమాన తరాలకే కాదు భవిష్యత్‌ తరాలకు ఉపకరించే విధానాలు ప్రకృతి సమ్మతంగా ఉండాలి. ప్రకృతి సహజ వనరుల్ని దోచుకోడమే పురోగతి కాదు. ప్రకృతి ఒడిలో మనుషులు హాయిగా ఉండాలంటే ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ప్రకృతిని పరిరక్షించడమంటే మనల్ని మనం రక్షించుకోవడమే కాదు… భావితరాలకు ఆరోగ్యకరమైన, సుందర సహజ ప్రకృతి గమనాన్ని అందించడం అవసరం. అందుకు అనుగుణంగా మన విధానాలను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చుకోవాలి. చెరువులను కాపాడుకోవడం, పశువుల సంతతిని పెంచడం, రసాయన ఎరువులను దూరం చేయడం అలవర్చుకోవాలి. పాతపద్దతుల్లోనే వ్యవసాయాన్ని సాధించాలి. సేంద్రియ ఎరువులను ప్రభుత్వమే పంపిణీ చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. చెరువులను కాపాడుకుంటూ బలోపేతం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొన్ని పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేయబోతున్నాయి. గొర్లు, మేకల పెంపకం, పాడి అభివృద్ది, చెరువుల

పునరుద్దరణ,చేపల పెంపకం వంటివన్నీ పర్యావరణ హితంతో కూడుకున్నవే. అలాగే గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేవే. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న చెరువులన్నింటిలోనూ ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసారు. ఇక గొర్రెలు, మేకల పెంపకం, హరితహారం వంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు కారణంగా పర్యావరణం పరిఢవిల్లడంతో పాటు గ్రావిూణ ఆర్థికరంగం పుంజుకోవడం ఖాయంగా ఉంది. ఇవి దేశానికి దిశానిర్దేశం చేసేలా లబ్దిదారులు పాటుపడాలి. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడితే పల్లె స్వరూపం మారి పచ్చగా స్వాగతిస్తుంది.