Wednesday, 4 November 2026

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ

 

మత్స్యకారుల్లో వెల్లివిరుస్తోన్న ఆనందం

హైదరాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి): మూడు దశల్లో చేపట్టిన మిషన్‌ కాకతీయ వల్ల చెరువుల పునరుద్దరణ జరిగి అవి జలకళను సంతరించుకున్నాయి. నాలుగోదశ పునరుద్దరణ పనులుకూడా పూర్తి కావస్తున్నాయి. దీంంతో మరిన్ని చెరువుల్లో ఈ వర్షాకాంలో నీరు చేరగలదు. తొలకరి పలకరించినందున ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ఆయా గ్రామాల్లో చెరువులకు మళ్లీ మహర్దశ పట్టింది. దీంతో మత్స్యకారులు గతంలో ఎన్నడూ లేనంతంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండేళ్ళలో మత్స్యపారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందగలదు. చేపల ఉత్పత్తికి అనువుగా ఉన్న నీటివనరుల్లో నదులు, కాలువలు, వాగులు, వంకలు, చెరువులు, నీటి ప్రాజెక్టులు, కుంటలు తెలంగాణలో పుష్కలంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆ మధ్యన వేసిన చేపవిత్తనాల ఫలాలు అందుకో బోతున్నారు. రాష్ట్రంలోని మత్స్యకారులు ఇప్పుడిప్పుడే వాటి ఫలాలను అందుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊతం లభించడంతో తెలంగాణలో మత్స్యపారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమం అమల్లోకి వచ్చినందుకు మత్స్య కార్మిక కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. శరవేగంతో తీసుకొస్తున్న ఈ మార్పులు కారణంగా దశాబ్దాల పాటు నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంత మత్స్యపారిశ్రామిక రంగంలో పురోభివృద్ది కనిపిస్తోంది. ఆచరణలో విజయవంతం కావడానికి అనువైన వాతావరణాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం,బాధ్యత ఇక మత్స్యకారులపైననే ఉంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పలు సందర్భాలలో చేసిన వ్యాఖ్యానాలు, ప్రభుత్వం తాజాగా అమలు జరుపుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీ వారికి వరంగా మారింది. చేపల పెంపకం, ఉత్పత్తి అనే అంశాలు కేవలం మత్స్యకారులకో, ఆ రంగానికో మాత్రమే పరిమితమైన అంశాలు కాదు. ఇందులో పోషకాహార సరఫరా, ఆహార భద్రత, పౌష్టికాహార లభ్యత, విదేశీ మారకద్రవ్యం, ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన లాంటి అనేక కీలకమైన అంశాలు కూడా ముడివడి ఉన్నాయి. అందువల్ల చేపల ఆహారం విషయంలో ప్రజల్లో కూడా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకుని అమలుపరచాల్సి ఉంది.ఇందుకు అనుగుణంగా చేపల ఆహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లాలి. చేపల మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నాలు సాగాలి. గ్రామాల నుంచి పట్టణాల వరకు చేపల విక్రయం అందుబాటులోకి రావాలి.ముఖ్యంగా ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలుపరచవలసిన క్షేత్రస్థాయి మత్స్య సహకార సంఘాల సభ్యుల్లో ముందుగా అవగాహన కల్పించాలి. స్థానికంగా ‘చేప విత్తనాలు’ ఉత్పత్తిని శరవేగంగా పెంచి స్వయం సమృద్ధిని సాధించవలసిన అవసరం ఉన్నది. చేప పిల్లల కోసంఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు చేపవిత్తనాల ఉత్పత్తి కేంద్రాల విూదనే ఆధారవడవలసి ఉంది. ‘ఫిష్‌ సీడ్‌ ఫామ్స్‌’ నిర్వహణలో స్థానిక సొసైటీలకు అవసరమైన అవగాహన కల్పించి, శిక్షణ ఇవ్వగలిగితే వేలాదిమందికి ఉపాధిని కల్పించడంతోపాటు కోట్లాది రూపాయల రవాణా వ్యయాన్ని తగ్గించుకోగలం. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌తో వెయ్యికోట్ల రూపాయల నిధులను సమకూర్చడం సామాన్య విషయం కాదు. దీనికితోడు మత్స్యకారుల జీవిత బీమాను మూడు లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచడం ఆహ్వానించ దగ్గపరిణామం. మత్స్యసహకార సంఘాల్లో సభ్యత్వ నిబంధనలను రెండున్నర ఎకరాల నీటి విస్తీర్ణం నుంచి ఒక ఎకరానికి తగ్గించడం వల్ల కుంటల్లో చేపలు పెంచే అవకాశం దక్కింది. కొత్త సొసైటీల ఏర్పాటు, నూతన సభ్యులను చేర్చుకునే నిబంధనలను సడలించడం వల్ల అనేకులకు అవకాశాలు వస్తున్నాయి. కొత్తగా రెండు ఫిషరీస్‌ కళాశాలల ఏర్పాటు, చేపల మార్కెట్ల నిర్మాణం, మత్స్యశాఖలో నాలుగువందల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం, చేపల ఉత్పత్తి వ్యాపారంలో మధ్యదళారీల పాత్ర తగ్గించడం లాంటి చర్యలు తెలంగాణ ఫిషరీస్‌ భవిష్యత్తుకు బాటలు వేస్తాయనే విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. ఇకపోతే ఆధునిక పద్ధతుల్లో నిర్వహించే ‘ఆక్వా కల్చర్‌’ విధానంలో మాత్రమే రొయ్యల ఉత్పత్తి లాభసాటిగా సాధ్యపడుతుంది. చేపల పెంపకంలో కూడా ఆధునిక పద్దతులను వీరు అలవాటు చేసుకుంటేనే అధిక ఉత్పత్తికి అవకాశాలు ఉంటాయి. ఆక్వా కల్చర్‌ పద్ధతులను, చేప విత్తనాల ఎంపిక నుంచి, జలాశయాల శుద్ధి, కాలానుగుణంగా చేపలకు అందించలవసిన కృత్రిమ దాణా, ఆక్సిడేషన్‌ బ్యాక్టీరియా నివారణ, వైరస్‌ గుర్తింపు లాంటి అనేక అంశాలు చేపల సాగుకు అలవర్చుకోవాలి. ఆధునిక మత్స్య పారిశ్రామిక పద్ధతుల పట్ల అవగాహన కల్పించడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించగలం. మత్స్యకార్మికులకు ఈ రంగంలో ఆదాయమార్గాలను పెంచడంద్వారా వారిని పూర్తికాలపు వృత్తికార్మికులుగా తీర్చిదిద్దితే నిరంతరంగా పరిశ్రమ వృద్ది చెందగలదు. చేపల పెంపకంలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక పద్ధతులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి. జాతీయ పరిశోధన, శిక్షణా సంస్థలకు సంబంధించిన ప్రాంతీయ కేంద్రాలను ఇక్కడ నెలకొల్పుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ అంశాలన్నింటినీ సమన్వయం చేసేందుకు, సరైన పర్యవేక్షణ నిర్వహించేందుకు మత్స్యశాఖను మరింతగా బలోపేతం చేసుకోవాలి. ఆధునిక మత్స్యపారిశ్రామిక పద్ధతులతో ముడివడి ఉన్న వివిధ అంశాలకు సంబంధించిన వేరువేరు విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టవలసి ఉన్నది.