అనంతపురం,నవంబర్22: బహిరంగంగా పాఠశాల క్రీడామైదానాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెవెన్యూ మంత్రి, అడిషినల్ జాయింట్ కలెక్టర్‌లు స్థలాన్ని పాఠశాలకు అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేసినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అధికారులను నిలదీశారు.గ్రామస్థులు కబ్జాకు పాల్పడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చేయకపోతే ధర్నాకు పూనుకుంటామన్నారు. హిందూపూర్ వీవర్స్‌కాలనీ ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన క్రీడాస్థలాన్ని ఇటీవల కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్థులు హిందూపురానికి రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి వచ్చినప్పుడు ఫిర్యాదు చేశారు. స్వయంగా ఆయన స్థలం వద్దకు వెళ్ళి పరిశీలించి ఆర్డీఓ ఈశ్వర్‌కు ఆ స్థలం పాఠశాలకు చెందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది జరిగి వారం కూడా గడవక ముందే కబ్జా దారులు మరోసారి స్థల అక్రమణకు ప్రయత్నించారు. క్రీడా స్థలంలో ఉన్న జాతీయ జెండా పీఠాన్ని ధ్వంసం చేశారు.మైదానాన్ని చదును చేస్తుండగా గ్రామస్థులు అడ్డుపడ్డారు. తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని కబ్జా దారులను అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పీసీసీ కార్యదర్శి నవీన్‌నిశ్చల్, ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీలు కూడా రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని కబ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. స్పందించిన తహసీల్దార్ అక్కడ నుంచే ఫోన్ ద్వారా పోలీసులతో మాట్లాడి కబ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల స్థలంపై ఇక పై ఇతరులేవరు కబ్జాలు, దౌర్జాన్యాలు చేయకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హావిూ ఇచ్చారు. స్థలాన్ని పాఠశాలకు చెందేలా అధికారిక చర్యలు వెంటనే తీసుకుంటామనారు.




