దర్యాప్తు చేపట్టిన పోలీసులు
హైదరాబాద్,నవంబర్26(జనంసాక్షి): పాత నేరస్థుడు కృష్ణను అవిూర్పేట ఎల్లారెడ్డిగూడలో కొందరు గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కృష్ణ కరుడుగట్టిన పాత నేరస్థుడని, అతనిపై చాలా కేసు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఘటనాస్థలిలో క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. పాత కక్షలతోనే కృష్ణను దుండగులు హత్యచేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా, సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా నివసించే కృష్ణను ఆర్థరాత్రి దాటిన తరువాత కొందరు ఆగంతుకులు కత్తులతో పొడిచారు. తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. పాత కక్షలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.




