పాపికొండలు ప్రయాణంలో అపశృతి
అగ్నిప్రమాదానికి గురైన పడవ
పలువురికి తీవ్ర గాయాలు
తక్షణమే స్పందించి రక్షించిన పోలీసులు, గ్రామస్థులు
రాజమండ్రి,మే11(జనం సాక్షి ): పాపికొండలు యాత్రకు వెళ్లిన ఓ పడవలో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వీరంతా స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద శుక్రవారం ఉదయం పడవలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. పోశమ్మగుడి నుంచి బయల్దేరిన 10 నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పడవలో మంటలు చెలరేగడంలో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన గురించి తెలుసుకున్న వీరవరపులంక వాసులు నదిలో ఈదుకుంటూ వెళ్లి 40 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. సమాచారమందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. స్థానికుల సాయంతో మిగతావారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మంటల ధాటికి పడవ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ప్రయాణికులను అక్కడి నుంచి తరలించి వైద్య సేవలు అందించారు. పర్యాటక బోటులోని జనరేటర్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
సిఎం చంద్రబాబు ఆరా
పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ప్రయాణికుల క్షేమ సమాచారంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. శుక్రవారం ఉదయం పాపికొండలు విహార యాత్రకు వెళ్లిన పడవలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరినీ అధికారులు, పోలీసులు.. స్థానికుల సాయంతో సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనలో పడవ పూర్తిగా దగ్ధమైంది.
—-