టేక్‌మాల్ : పాముకాటుతో రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సర్మోనికుంట తాండాలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. అదే తాండాకు చెందిన రవీందర్ తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో పంటలు పండిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి పంటకు కాపలాగా వెళ్లి అక్కడే నిద్రిస్తున్న సమయంలో రవీందర్‌ను పాముకాటు వేసింది. వెంటనే అతన్ని కుటుంబసభ్యులు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సంగారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో రవీందర్ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.




