Wednesday, 4 November 2026

పారదర్శక ఎన్నికల నిర్వహనలో.. ఎన్నికల సంఘం విఫలమైంది

– ఓటర్ల జాబితా సవరించకుండానే ఎన్నికలకెందుకెళ్లారు?
– నూరుశాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించలేదు
– రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో వీవీప్యాట్‌లు లెక్కించారు
– ఈవీఎంల ట్యాంపరింగ్‌నే కేసీఆర్‌ నమ్ముకున్నారు
– టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
– ఈసీ వైఫల్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా
హైదరాబాద్‌, జనవరి24(జ‌నంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని, ఎన్నికల నిర్వహణలో ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగాయని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ఈధర్నా కార్యక్రమంలో తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, తెజస
అధ్యక్షుడు కోదండరాంతో పాటు కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. నూటికి నూరుశాతం ఎక్కడా వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఆరోపించారు. ఈవీఎంలపై అనుమానం వచ్చి ఓట్ల లెక్కింపు రోజే తమ అభ్యర్థులందరికీ మెసేజ్‌లు పంపామని చెప్పారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో నూరుశాతం వీవీప్యాట్‌లు లెక్కించారని చెప్పారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరించకుండా ఎన్నికలకు ఎందుకు వెళ్లారని ఎన్నికల సంఘాన్ని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఈసీ విఫలమైందని ఉత్తమ్‌ ఆరోపించారు. ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ఎక్కువ మంది ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఓటర్ల నమోదులో ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. గ్రావిూణ ప్రాంతాల్లో సాంకేతికపై అంతగా అవగాహన లేదని.. ఈవీఎంలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని చెప్పారు.
ఈవీఎంల ట్యాంపరింగ్‌నే కేసీఆర్‌ నమ్ముకున్నాడు – ఎల్‌. రమణ
ప్రస్తుతం వేలాది గ్రామాల్లో బ్యాలెట్‌ పేపర్ల ద్వారానే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని,  పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా ఆరోపణలు రాలేదని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు.
ఫోన్లు, ఈవీఎంల ట్యాంపరింగ్‌నే కేసీఆర్‌ నమ్ముకున్నారని రమణ ఆరోపించారు. ఎన్నికల్లో ఈవీఎంలను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో మాత్రం 22 లక్షల మందికి ఓటుహక్కు లేదన్నారు. పోలైన ఓట్లకు.. లెక్కించిన ఓట్లకు తేడా ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఓటు కూడా తేడా రాకూడదని.. అలాంటిది 31 నియోజకవర్గాల్లో తేడాలొచ్చాయని చెప్పారు. ఈవీఎంల బదులు బ్యాలెట్‌ పేపర్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. తెరాస ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలున్నాయన్నారు.