– 127 మంది మృతి
– అత్యయిక పరిస్థితి ప్రకటించిన అధ్యక్షుడు
– దేశ సరిహద్దులు మూసివేత
పారిస్,నవంబర్14(జనంసాక్షి): పారిస్ నగరంలో ఉగ్రవాదులు మరోమారు నరమేధం సృష్టించారు. ఉగ్రదాడులతో నగరంవణికిపోయింది. నగరంలోని పలు చోట్ల ఉగ్రవాదులు విచక్షణారహితంగా పేలుళ్లు, కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రదాడిలో 170మంది ప్రాణాలు కోల్పోయారని ప్రాథమిక సమాచారం. ఈ దాడుల్లో మరో వందమందికి పైగా గాయపడ్డారు. పారిస్‌లోని ఓరెస్టారెంట్‌లో ఆగంతకుడు కొందరిని బందీలుగా చేసుకున్నట్లు తొలుత వార్తలొచ్చాయి. కొద్దిసేపటికే ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారని, తాను రెస్టారెంట్‌లో చిక్కుకుపోయినట్లు బీబీసీ జర్నలిస్టు ఒకరు పోలీసులకు సమాచారమందించాడు. ఆతర్వాత ఫ్రాన్స్ జాతీయ స్టేడియం వద్ద జరిగిన మరో పేలుడు ఘటనలో ముగ్గురు మృతిచెందారు. అదే సమయంలో బతక్లాన్ సాంస్కృతిక ప్రదర్శన శాలలో సాయుధులు జొరబడి తూటాల వర్షం కురిపించారు. వంద మంది పౌరులను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. ఫ్రాన్సు జాతీయ స్టేడియం సహా పలు రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌లలో కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ఆరుచోట్ల కాల్పులు, మూడుచోట్ల పేలుళ్లు జరిపారు. పారిస్ స్టేడియం దగ్గర రెండు ఆత్మాహుతి దాడులు జరిపారు. ఉగ్రవాదులు పౌరులను నిర్బంధించిన బాటాక్లాన కాన్సర్ట్‌హాలును భద్రతాదళాలు ముట్టడించాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. దేశ సరిహద్దులను ఫ్రెంచి మిలటరీ మూసివేసింది. దేశంలో ఎమర్జెన్సీని విధించారు. తొలుత ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న వందమందిని పొట్టన పెట్టుకున్నారు. వంద మందిని బంధించి ఒకేసారి బాంబులతో పేల్చేసినట్లు ప్రత్యక్ష
సాక్షులు తెలిపారు. బతక్లాన్‌సాంస్కృతిక ప్రదర్శనశాల వద్ద పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆత్మాహుతి దాడుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పేలుడు, కాల్పుల ఘటనల్లో ప్రాథమిక సమచారం మేరకు 170మందికి పైగా మృతిచెందారని తెలుస్తోంది. పారిస్‌లో ఉగ్రవాదులు కలకలం సృష్టించడంతో అప్రమత్తం అయిన భద్రతా బలగాలు పారిస్‌ను దిగ్బంధించాయి.పారిస్ నగరంలో పలు చోట్ల కాల్పులు, పేలుళ్లకు పాల్పడడంతో గాలింపు చేపట్టారు. ఈ ఉగ్ర దాడుల్లో 170 మందికిపైగా మృతి చెందినా మరింతగా మృతుల సంఖ్య పెరగగలదని భావిస్తున్నారు.
ఫుట్‌బాల్ మ్యాచ్ మైదానానికి సవిూపంలోనే పేలుడు
ఫ్రాన్స్, జర్మనీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న మైదానానికి చేరువలోనే ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ¬లాండ్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. పేలుడు ఘటన జరగడంతో మైదానం నుంచి ¬లాండ్‌ను భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. అప్రమత్తమైన అధికారులు మైదానంలో తొక్కిసలాట జరక్కుండా 3గేట్ల ద్వారా ప్రేక్షకులను బయటకు పంపారు. ఉగ్రవాదుల కోసం సైన్యం రంగంలోకి దిగింది.
అత్యవసర పరిస్థితి విధింపు
ఉగ్రవాదుల దాడి ఘటన అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ¬లాండ్ అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు. పారిస్‌లో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. దోషులను సమాజం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయంలో దేశమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో లాండ్ తన టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పారిస్‌లో జరిగిన అతిపెద్ద నరమేధం ఇది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పారిస్‌లో అత్యయిక పరిస్థితి ప్రకటించడం ఇదే తొలిసారి. తంలో రెండుసార్లు ఉగ్రదాడి జరిగినా ఇంతపెద్ద మొత్తంలో ప్రాణనష్టంజరగలేదు.
ఉగ్రదాడులను ఖండించిన భారత్,ప్రపంచ నేతలు
పారిస్‌లో ఉగ్రవాదులు దాడి ఘటనపై ప్రపంచ దేశాలు తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పారిస్‌లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 170మంది మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. పారిస్‌లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. ఈ కష్ట సమయంలో ఫ్రాన్స్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ … పారిస్‌లో ఉగ్రదాడుల ఘటనను తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడి ఘటన తీవ్ర మనోవేదన, క్షోభకు గురి చేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పేలుళ్లలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాక్షించారు. పారిస్‌లో జరిగిన ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు వ్లాద్‌మిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని అమానవీయ చర్యగా వ్యాఖ్యానించారు. జర్మన్ ఛాన్స్‌లర్ ఎంజెలా మెర్కల్ కూడా ఉగ్రవాదుల చర్యలను ఖండించారు. బ్రిటన్ ప్రధాని కామెరాన్, అమెరికా అధ్యక్షుడు ఒబమా సహా పలు దేశాల నేతలు దాడిని తీవ్రంగా ఖండించారు. ఫ్రాన్స్‌కు అండగా ఉంటామని ప్రకటించారు.
భారత్‌లో హై అలర్ట్
పారిస్ నరమేధం నేపథ్యంలో భారత్‌లో హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ఉగ్రదాడులు ముంబై దాడులను పోలి ఉండడంతో భారత్ అప్రమత్తం అయ్యింది. ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, ప్రధాన సెంటర్లలో పట్టిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పారిస్ నగరంలో పలు చోట్ల కాల్పులు, పేలుళ్లు జరిగిన ఘటనలో 170 మంది మరణించిన విషయం తెలిసిందే. రాజధాని ఢిల్లీ, ముంబై సహా కోల్‌కత , బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. అటు అగ్రరాజ్యం అమెరికా సైతం పారిస్ ఘటనతో అప్రమత్తమైంది. ఈ ఘటనపై ప్రపంచ దేశాల అధినేతలుగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు.పారిస్‌లో ఉగ్రవాదులు మారణ¬మం సృష్టించడంతో భారత రాయబార కార్యాలయం అప్రమత్తం అయ్యింది. ఉగ్రదాడి నేపథ్యంలో పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. సమాచారం, సహాయం కోసం 0033140 507070 నంబరుకు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.
ఎకె 47తో నరమేధం సృష్టించిన ముష్కరులు
అమెరికన్ రాక్ బ్యాండ్ ప్రదర్శనను ఆనందంలో వీక్షిస్తున్న వారు ఒక్కసారిగా భయకంపితులయ్యారు. ఏకే-47లతో విరుచుకుపడిన ఉగ్రవాదుల బారి నుంచి తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. నరరూప రాక్షసులుగా వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా పెద్దగా అరుస్తూ, ఏడుస్తూ, తమను తాము కాపాడుకోవడానికి నేలపై పడుకున్నారు. కానీ ఉగ్ర పిశాచాలు వారిని కనికరించలేదు. దాదాపు మూడుసార్లు ఏకే-47లతో అత్యంత పాశవికంగా తూటాల వర్షం కురిపించారు. వందలాది మంది ఒకే చోట చిక్కడంతో రక్తదాహం తీర్చుకున్నారు. ఇదంతా 10 నిమిషాల్లో జరిగింది. భయంకర క్షణాలను అక్కడే ఉన్న యూరోప్ 1 రేడియో స్టేషన్ రిపోర్టర్ జూలియన్ పీర్స్ దగ్గర్నుంచి చూశారు. ఆ పది నిమిషాలు అత్యంత దారుణమైన, బాధాకరమైన, భయంకరమైనవని చెప్పారు. ఇది హేయమైన నరమేధమని తెలిపారు. జనమంతా పెడబొబ్బలు పెట్టారని, ప్రతి ఒక్కరూ నేలపై పడుకున్నారని, అదంతా 10 నిమిషాల్లో జరిగిపోయిందని రోదిస్తూ చెప్పారు. ఆ సమయంలో చాలా తుపాకీ పేలుడు శబ్దాలు వినిపించాయన్నారు. ఉగ్రవాదులు చాలా ప్రశాంతంగా, దృఢ నిశ్చయంతో ఉన్నారని, దాదాపు మూడునాలుగుసార్లు రీలోడ్ చేసుకొని మరీ కాల్పులు జరిపారని చెప్పారు. వారు నినాదాలేవీ చేయలేదన్నారు. తాను చూస్తుండగా కనీసం 25 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. శుక్రవారం రాత్రి తూర్పు పారిస్‌లోని బటక్లాన్ థియేటర్‌లో అమెరికన్ రాక్ బ్యాండ్ ప్రదర్శన జరుగుతూండగా ఈ హేయమైన నరమేధం జరిగింది. దీనికి పాల్పడిన ఉగ్రవాదులందర్నీ హతమార్చినట్లు పోలీసులు ప్రకటించారు. దాడులను ప్రోత్సహించినవారికోసం గాలింపు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ దాడులకు బాధ్యత తమదేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. పారిస్‌లో కర్ఫ్యూ విధించారు. ఇక్కడ కర్ఫ్యూ విధించడం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే తొలిసారి. పారిస్‌నగరంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఇందులో కేవలం ఆరుగురంటే ఆరుగురే నరమేధానికి కారణంగా గుర్తించారు. వీరు ఎలాంటి బెదురు లేకుండా కేవలం నిముషాల్లో 170 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 170మందికి పైగా మృతిచెందారు. కేవలం ఆరుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పారిస్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఉగ్రవాదుల దాడిని ప్రత్యక్షంగా చూసిన ఓ జర్నలిస్టు పోలీసులకు సమాచారమందించాడు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అయితే కొందరు ఉగ్రవాదులను ఇప్టపికే పోలీసులు మట్టుబెట్టారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు. పారిస్‌ను దిగ్బంధించి సరిహద్దులను మూసేశారు. ప్రజలు ఎవరుకూడా ఇళ్లనుంచి బయటకురావద్దని సూచించారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ప్రాన్స్ మృతులకు నివాళి
పారిస్‌పై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవార్ధం న్యూయార్క్ నగరంలో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను రంగుల దీపాలతో వెలిగించారు. ఫ్రాన్స్ దేశపు జెండాలోని నీలం, తెలుపు, ఎరుపు రంగుల దీపాల కాంతుల్లో ట్రేడ్ సెంటర్ మెరిసిపోయింది. మృతుల గౌరవార్ధం కొన్ని రోజుల పాటు ఆ భవనంపై ఫ్రాన్స్ జెండా రంగుల్లో లైట్లు వెలిగిస్తామని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ వెల్లడించారు. కెనడాలోని ప్రధాన నగరం టొరంటోలోని ప్రసిద్ధ సీఎన్ టవర్‌ను కూడా ఫ్రాన్స్ జెండా రంగుల దీపాలతో వెలిగించారు. పలువరు పౌరులు ఇక్కడ చేరుకుని శ్రద్దాంజలి ఘటించారు.





