– జీ 20 సదస్సులో ప్రధాని మోదీ
ఇస్తాంబుల్ నవంబర్ 15 (జనంసాక్షి):
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ కలిసి పోరాడాలని ప్రధాని మోదీ అన్నారు. టర్కీలోని అంటల్యాలో ఆదివారం నుంచి జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌పై ఉగ్రవాదుల దాడిని ప్రధాని మోదీ ఖండించారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రపంచమంతా ఏకమవ్వాలన్నారు. కఠిన చర్యలతోటే ఉగ్రవాదాన్ని అణచివేయగలమన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడమే బ్రిక్స్ దేశాల తొలి ప్రాధాన్యం కావాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులు మానవాళిపై జరుగుతున్న దాడులుగా మోదీ అభివర్ణించారు. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్ధిక సంబంధాలు మరింత బలపడాలని చెప్పారు. బ్రిక్స్ దేశాలకు అధ్యక్షత వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలు.టర్కీలో ఆదివారం నుంచి రెండు రోజులపాటు జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. అంటాల్యా నగరంలో జరగనున్న ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ సహా పలు సభ్య దేశాల ప్రధానులు, అధ్యక్షులు పాల్గొననున్నారు. అనివార్య కారణాలవల్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హ్పలాండే సదస్సుకు హాజరుకావడంలేదు. సదస్సులో ప్రధాని మోడీ.. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, నల్లధనం తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. ఉగ్రవాద నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, నల్లధనం వెలికితీతలో అంతర్జాతీయ సహకారం కోరనున్నారు. అటు సదస్సుకు హాజరయ్యే కొన్ని సభ్య దేశాల అధినేతలతో ప్రధాని విడివిడిగా సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపనున్నట్లు సమాచారం.





