మంత్రివర్గ విస్తరణ, తాజా పరిస్థితులపై సమాలోచనలు
ఫరూక్, కిడారి శ్రవణ్‌లకు మంత్రివర్గంలో చోటు
నేడు ప్రజావేదికలో ఆ ఇద్దరిచేత ప్రమాణం
అమరావతి,నవంబర్10(జనంసాక్షి): మంత్రివర్గ విస్తరణపై సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, ఎస్టీ,
మైనారిటీ నాయకులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ, మండలి ఛైర్మన్ స్థానం భర్తీ, తాజా రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించారు. మండలి ఛైర్మన్ ఫరూక్, శ్రావణ్లను మంత్రివర్గంలోకి తీసుకుంటున్న విషయాన్ని చంద్రబాబు వారికి వెల్లడించారు. మంత్రిపదవి ఆశించిన నేతలను ఈ సందర్భంగా సీఎం బుజ్జగించారు. శాఖల మార్పులు-చేర్పుల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కీలకమైన వైద్యారోగ్య శాఖ బాధ్యతలు కొత్త మంత్రికి ఇవ్వాలా? లేక సీనియర్ మంత్రికా? అనే అంశంపై తర్జన భర్జన జరగుతోంది. మండలి ఛైర్మన్ స్థానానికి పరిశీలనలో షరీఫ్, రెడ్డి సుబ్రమణ్యం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే చాంద్ భాషాతోనూ ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. మంత్రి వర్గ విస్తరణ కోసం విజయవాడకు రానున్న గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఆదివారం ప్రజావేదికలో మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ హైదరబాద్‌కు తిరుగు పయనమవనున్నారు. మంత్రి పదవులు దక్కక పోవడంపై అసంతృప్తి లేదని తెదేపా నేతలు జలీల్‌ఖాన్, చాంద్‌బాషా స్పష్టం చేశారు. కేంద్రంతో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం కుదరడం లేదని.. ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు చెప్పారు. అయితే మంత్రి పదవి విషయంలో తనకు అసంతృప్తి లేదని ఎమ్మెల్యే చాంద్‌బాషా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. మైనారిటీ కోటాలో గత విస్తరణలోనే తన పేరు చివరి నిమిషం వరకూ పరిశీలించారని.. కొన్ని రాజకీయ సవిూకరణాల్లో భాగంగానే తనకు అవకాశం దక్కలేదన్నారు. చంద్రబాబు తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. మంత్రి పదవిపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కూడా స్పందించారు. తాను సీనియర్నేనని.. మంత్రి పదవి ఆశించానని చెప్పారు. కొన్ని సవిూకరణల వల్ల మంత్రి పదవి దక్కలేదన్నారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి ఇచ్చారని.. సర్దుకుపోయానని వివరించారు. అయితే ముస్లిం మైనారిటీల నుంచి ఎన్.ఎం.డి.ఫరూక్, ఎస్టీ వర్గాల నుంచి కిడారి శ్రావణ్ కుమార్‌లకు చోటు కల్పిస్తున్నారు. ఆదివారం ఉదయం 11.45 గంటలకు ఉండవల్లిలోని ప్రజా వేదికలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.




