Tuesday, 3 November 2026

పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ పోరాటం


కాంగ్రెస్‌ను నమ్మలేం : కోదండరామ్‌
హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) :
పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టే వరకూ పోరాడుతామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీని నమ్మలేమని తెలిపారు. ‘ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని అన్నారు.. 2009 డిసెంబర్‌ 9న ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించారు. ఆ తర్వాత వెనక్కు తగ్గారు. తొలి నుంచి తెలంగాణపై కాంగ్రెస్‌ మాట మార్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీని నమ్మేదే లేదు’ అని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అంశంపై వివిధ జాతీయ పార్టీల నేతలతో జరిపిన రౌండ్‌టేబుల్‌ సమావేశం విజయవంతమైందన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించినా.. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టే వరకూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్‌ను నమ్మకూడదని గతంలోనే తెలిసొచ్చిందన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు కాంఆంగ్రెస్‌ హైకమాండ్‌పై ఒత్తిడి తేకపోతే తెలంగాణకు నష్టం జరగవచ్చునని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలను కలవడాన్ని తప్పుబడుతూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కోదండరాం ఖండించారు. తెలంగాణ విషయంలో జేఏసీ విధానం మారలేదని తెలిపారు. జేఏసీ ఏం మాట్లాడినా, ఏం చేసినా ప్రత్యేక రాష్ట్రం కోసమేనని తేల్చి చెప్పారు. ఉద్యమంలో ఉన్నప్పుడు విమర్శలు సహజమని, వాటిని పట్టించుకోబోమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *