Tuesday, 3 November 2026

మేం పాల్గొనకుండా మీ సభ సమైక్యాంధ్ర ఎట్లైతది


మీది సీమాంధ్ర సభే : పొన్నం
హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) :
తెలంగాణ వాళ్లు పాల్గొనకుండా నిర్వహించేది సమైక్యాంధ్ర సభ ఎలా అవుతుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు పెట్టుకున్నది ముమ్మాటికీ సీమాంధ్ర సభే అని ఆయన పేర్కొన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీయే ముఖ్యమని తాము బావిస్తున్నామని, కేవలం స్వార్థమే పరమావధిగా ఉన్న సీమాంధ్రులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీఎం, పీసీసీ అధ్యక్షుడు చూసుకోవాలని అన్నారు. తెలంగాణ తీసుకునేవారం కాబట్టి సంయమనంతో ఉన్నామన్నారు. మూడు సంవత్సరాల తర్వాత కూడా కలిసి ఉండాలంటే దుర్మార్గమే అవుతుందన్నారు. సీమాంధ్రలో పెట్టుకునే సభలకు ఏపేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ వారు లేకుండా అధిసమైక్యాంధ్ర సభలెలా అవుతాయని సీమాంధ్ర నేతలను నిలదీశారు. తెలంగాణ అంశాన్ని రాజకీయం చేయాలనుకుంటున్న సీమాంధ్ర నేతలపై ఏం చర్యలు తీసుకుంటారో సీఎం, పీసీసీ అధ్యక్షుడు, క్రమశిక్షణా సంఘం ఆలోచించాలన్నారు. రాజీనామాలు చేస్తామని ఒకరు, రాజకీయాలనుంచే తప్పుకుంటామని మరొకరు, అసెంబ్లీలో తీర్మాణం వీగిపోతుందని మరొకరు వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణలో రెచ్చగొడుతున్నారన్నారు. ఇప్పటివరకు తెలంగాణా ప్రజలు ఆదినుంచి సంయమనంతోనే ఉన్నారన్నారు. అధిష్టానం ఓ సంకేతం ఇచ్చిపోయాక కూడా మరోసారి రాష్ట్రంలో గందరగోళం సృష్టించడం దారుణంగా ఉందన్నారు. తెలంగాణ ఇచ్చేందుకు హైకమాండ్‌ సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసమే అడుగులు వేగంగా పడుతున్నాయన్నారు. సీమాంధ్రలో 32 స్థానాలు కైవసం చేసుకుంటామని కాలర్‌ ఎగి రేసిచెప్పే దమ్ము దైర్యం ఉందాని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే 15 ఎంపీ స్థానాలను గెలిపించుకు ని వస్తామన్నారు. ఒక్క వ్యక్తికోసం పదులకొద్ది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నా తెలంగాణలో ఒక్క వ్యక్తి కూడా పార్టీని వీడలేదన్నారు. పార్టీపై గౌరవం ఎవరికి ఉందో దీనివల్లే తెలుస్తుందన్నారు. తెలంగాణ నేతలంతా అధిష్టానం చెప్పిన ప్రకారం శాంతంగానే ఉంటున్నామన్నారు. సీమాంధ్ర నేతలు జగన్‌కు వ్యతిరేకంగా సభలు నిర్వహించుకోవాలని హితవు పలికారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న టీ జేఏసీ నేతలు తెలంగాణ ఇచ్చే స్థాయిలో ఉన్న నేతలను, కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ పెద్దలు కలిస్తే టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తప్పుపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణపై చిత్తశుద్దితో ఉన్నామని పేర్కొంటున్న టీడీపీ నేతలు సీమాంధ్రులు చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలపైన, లగడపాటి వ్యాఖ్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణపై తీర్మానానికి సమయం ఆసన్నమైందని, చంద్రబాబుతో తీర్మానం కోసం ప్రకటన చేయించాలని ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *