న్యూఢిల్లీ, ఆగస్టు 12 : రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల రగడ మధ్య జేడీయూ నేత శరద్‌యాదవ్ మరో అంశాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలంటూ పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్‌లో చేసిన విజ్ఞప్తిపై ఆయన మండిపడ్డారు. భారత వాణిజ్య రంగానికి ఊతం ఇచ్చే వస్తువులు సేవల పన్నుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్ ముందు ఉంది. అయితే కొద్ది రోజులుగా సభలు నడవకపోవడంతో ఆ అంశం పెండింగ్‌లో పడిపోయింది. దాంతో 15 వేలకు మందికిపైగా పారిశ్రామిక వేత్తలు ప్రతిపక్ష ఎంపీలకు ఈ మేరకు ఆన్‌లైన్‌లో విజ్ఞప్తి చేశారు. దాంతో ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. పార్లమెంట్ ఎలా పనిచేయాలో చెప్పడానికి పారిశ్రామిక వేత్తలు ఎవరు? అంటూ శరద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండతోనే వారు రెచ్చిపోతున్నారని ఆయన విమర్శించారు.
68 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో మొదటిసారిగా పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా నడవాలంటూ బయట నుంచి పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని, ఈ పార్లమెంట్‌ను 125 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నారన్న విషయం వారు తెలుసుకోవాలని శరద్ యాదవ్ అన్నారు. మిమ్మల్ని (ప్రభుత్వాన్ని) ఇక్కడ కూర్చోబెట్టినట్టు ఆ పెట్టుబడిదారులపై ఆరోపణలు ఉన్నాయని, అవి నిజమని ఈ రోజు నిరూపణ అయిందని ఆయన అన్నారు.
దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, శరద్ యాదవ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పార్లమెంటట్ పనిచేయకూడదని సాధారణ పౌరులు కోరుకుంటారా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో నేరస్తులు మీరేనని, పార్లమెంట్‌ను నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారని జైట్లీ విమర్శించారు




