Wednesday, 4 November 2026

పాలమూరు అభివృద్ధి నిరోదకులు .. 

కాంగ్రెస్‌ నేతలు
– ఉమ్మడి పాలనలో వలస జిల్లాగా మార్చారు
– తెరాస హయాంలో అభివృద్ధి పర్చి వలసలను నివారిస్తున్నాం
– కేసీఆర్‌ ఆధ్వర్యంలో అన్ని వర్గాలను అభివృద్ధి
– తెలంగాణ పథకాలను చూసి దేశమొత్తం ఆశ్యర్యపోతుంది
– ఆంధ్ర ప్రజలు కేసీఆర్‌ను కోరుకుంటున్నారు
– దేశానికే ఆదర్శంగా తెలంగాణ రైతును నిలుపుతాం
– రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌
– షాద్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
షాద్‌నగర్‌, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : పాలమూరు అభివృద్ధి నిరోధకులు ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలేనని, మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే వాటిని అడ్డుకొనేందుకు ఈ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు కోర్టుకెక్కుతున్నారని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం షాద్‌నగర్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. పర్యటనలో భాగంగా మండల పరిషత్‌ కార్యాలయంలో ఆడిటోరియం నిర్మాణానికి, షాద్‌నగర్‌ మున్సిపాలిటీ భవన నిర్మాణానికి, 1700 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నాయకులు.. తెలంగాణ అభివృద్ధిని చూసి కొనియాడుతున్నారు. ఆంధ్రాకు చెందిన కొందరు ప్రజలు.. తమకు సీఎం కేసీఆర్‌ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారన్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీనికూడా ఆంధ్రాలో పెట్టండని అక్కడి ప్రజలు పిలుస్తున్నారు. కేసీఆర్‌ పాలనకు ఎంత జన ఆమోదం ఉందో దీన్ని బట్టి తెలుస్తుందన్నారు. షాద్‌నగర్‌కు గొప్ప చరిత్ర ఉందన్నారు. 1952-56 వరకు హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఈ షాద్‌నగర్‌ వ్యక్తే అని గుర్తు చేశారు. 1956లో బలవంతంగా ఆంధ్రాలో తెలంగాణను కలిసి ఆంధప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. సమైక్యాంధ్రలో దగాపడ్డ ప్రాంతం పూర్వపు పాలమూరు జిల్లా అని చెప్పక తప్పదన్నారు. అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టు ద్వారా పూర్వపు పాలమూరు, కొంత నల్లగొండ జిల్లాకు నీళ్లు ఇచ్చేలా నాటి నిజాం రూపకల్పన చేశారని, ఆ సమయంలోనే బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో కలపడం వల్లే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని కేటీఆర్‌ అన్నారు. దీంతో పాలమూరు జిల్లా అభివృద్ధికి నోచుకోలేకపోయిం దన్నారు. అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టు పూర్తయి ఉంటే పాలమూరు మరో కోనసీమ అయి ఉండేదన్నారు. పాలమూరు గోసకు గత పాలకులే కారణమని కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే మొత్తం చీకటి అయితదని అన్నారని, కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లోనే కరెంట్‌ సమస్యను అధిగమించామని తెలిపారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. రూ.5,600 కోట్లతో 43లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, కాంగ్రెస్‌ పాలనలో మనిషికి నాలుగు కిలోలు.. ఇంటికి 20 కిలోల చొప్పున మాత్రమే రేషన్‌ బియ్యం ఇచ్చామన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో మనిషికి ఆరు కిలోల చొప్పున.. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చనిపోయిన వారి పేర్ల విూద కాంగ్రెస్‌ నేతలు కేసులు వేస్తున్నారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.