Tuesday, 3 November 2026

పింఛన్లపై ఫిఖర్‌ వద్దు

Untitled-7

అర్హులందరికీ ఇస్తాం

సభలో ప్రభుత్వ ప్రకటన

హైదరాబాద్‌, నవంబర్‌ 18 (జనంసాక్షి) : అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని, పింఛన్లపై అర్హులెనవారందరూ ఫిఖర్‌ పెట్టుకోవదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగబోదని తెలిపింది. అదే సమయంలో అనర్హులైన వారికి పింఛన్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పింఛన్లపై మంగళవారం శాసనసభలో బీజేపీ అడిగిన ప్రశ్నకు ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కే.తారకరామారావు బదులిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందుతుందని చెప్పారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందని, ఆ తర్వాత పింఛన్లపై స్పష్టత వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు గొప్పల కోసమే ఆసరా పథకాన్ని ప్రారంభించారని బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్‌ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన పింఛన్ల అంశాన్ని ప్రస్తావించారు. అంతకు ముందు అసెంబ్లీలోని విూడియాపాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 4.60 లక్షల మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మహిళలు పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని, వారిని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులందరికీ పింఛన్లు అందేవరకు పోరాడతామన్నారు. సభలో ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించారు. సమగ్ర సర్వే నిర్వహించినప్పటికీ, పింఛన్ల కోసం మళ్లీ దరఖాస్తులు అడుగుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోనే 4.60 లక్షల మంది పింఛన్‌ దరఖాస్తులను అధికారులు తిరస్కరించారని పేర్కొన్నారు. శాసనసభలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల వారు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎంత మంది అర్హులు ఉన్నారు..? ఎంత మందికి పింఛన్లు ఇస్తున్నారు..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పింఛన్లపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. అర్హులందరికీ పింఛన్లు అందుతాయని స్పష్టం చేశారు. అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరిగిందని, తప్పకుండా పింఛన్‌ వస్తుందని హామీ ఇచ్చారు. బడుగు, బలహీనవర్గాల వారిని ఆదుకోవాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రస్తుతానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోందని, అది పూర్తయ్యాక స్పష్టత వస్తుందని చెప్పారు. పూర్తి స్పష్టత వచ్చాక పింఛన్లపై శాసనసభకు వివరాలు సమర్పిస్తామని తెలిపారు. అయితే, మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని లక్ష్మణ్‌ మరింత వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ.. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని కేటీఆర్‌ స్పష్టంగా చెప్పారన్నారు. అదే సమయంలో అనర్హులకు పింఛన్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *