స్వేచ్ఛా వాణిజ్యానికి అవకాశాలు
సిఇఓల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ
మెల్‌బోర్న్, నవంబర్18(జనంసాక్షి) : పెట్టుబడులకు భారత్ అనుకూలమని, స్వేచ్ఛా వాణిజ్యానికి మంచి అవకాలున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సిడ్నీలో మంగళవారం ఆయన సిఇఓల సమావేశంలో మాట్లాడారు. స్వేచ్ఛా వాణిజ్యం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం అందరికీ సమస్యగా మారింది… భారత్ మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందన్నారు. కాన్‌బెర్రా నుంచి మెల్‌బోర్న్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం విక్టోరియా రాష్ట్ర గవర్నర్‌తో భేటీ అయ్యారు. గవర్నర్ దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. ఆ నగరం చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. ఆ తర్వాత మోడీ గవర్నర్ హౌజ్‌లో ఆస్టేల్రియన్ కంపెనీల సీఈవోలతో సమావేశం అయ్యారు. భారత దేశంతో పెట్టుబడులు పెట్టడానికి, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు ఉన్న అవకాశాల గురించి వారికి వివరించారు. సుమారు 500 కంపెనీల సీఈవోలు, ఎండీలు ఆ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ వాణిజ్యవేత్తల ఆదానీ గ్రూప్‌కు చెందిన గౌతమ్ అదాని, మహీంద్ర సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, ఇన్ఫోసిస్ సీఈవో గౌతమ్ సిక్కా, ఓఎన్‌జీసీ డీఎండీ దినేష్ షరఫ్, ల్యాంకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్ మదుసూధనరావు తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం క్రియాశీలంగా పనిచేస్తుందన్నారు. తమ విధానాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అది కూడా స్వచ్ఛమైన, పారదర్శకంగా ఉన్న విధానాలకు అనుకూల వాతావరణమని మోడీ తెలిపారు. సంస్కరణ మార్గంలో వెళ్లేందుకు, పని పద్ధతి మార్చేందుకు అనేక చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ఆస్టేల్రియా పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నానని మోడీ అన్నారు. జీ20 సదస్సును విజయవంతం చేసిన ఆస్టేల్రియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య భావనలో ఐక్యంగా ముందుకెళ్దామని కోరారు. భారతీయ యువత మార్పు కోరుకుంటోందని, 30 ఏళ్ల తర్వాత భారత్‌లో స్థిర ప్రభుత్వం ఏర్పడిందని వివరించారు. ప్రాధాన్య రంగాల్లో ఆస్టేల్రియా భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు వెల్లడించారు. భారత ప్రజలు అభివృద్ధి, పారదర్శకత కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో భారత్-ఆస్టేల్రియా భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడాలని కోరారు. మోడీ ఆస్టేల్రియా పర్యటన సందర్భంగా భారత్-ఆస్టేల్రియా మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. సామాజిక, తీర ప్రాంత భద్రత, ఖైదీల బదలాయింపు, మాదక ద్రవ్యాల వాణిజ్యం అరికట్టడం, పర్యాటకం, సాంస్కృతిక రంగాలపై ఒప్పందాలు కుదిరాయి. సామాజిక భద్రత ఒప్పందం సానుకూలమైన పరిణామమని ఈ సందర్భంగా మోడీ వ్యాఖ్యానించారు. భద్రత సహకారంపై కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 2015లో ఆస్టేల్రియాలో మేక్ ఇన్ ఇండియా ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు మోడీ వెల్లడించారు. ఆస్టేల్రియా ప్రధాని టోనీ అబాట్ మాట్లాడుతూ… భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుందని ఆకాంక్షించారు. భారత్‌తో మరిన్ని ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. శాంతియుత ప్రయోజనాల కోసమే యురేనియం సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం వాణిజ్యం మాత్రమే కాదు ఇంధనం, భద్రత వంటి అంశాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చినట్లు టోనీ అబాట్ వెల్లడించారు. అంతకు ముందు ఆస్టేల్రియా రాజధాని కాన్‌బెర్రాలో మోడీ బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భంగా ఆస్టేల్రియా ప్రధాని టోనీఅబాట్‌కు మాన్‌సింగ్ ట్రోఫీ నమూనాను మోడీ బహూకరించారు. మొదటి ప్రపంచ యుద్ధానికి స్మారకంగా ఆ కానుకను మోడీ అందజేశారు.





