శ్రీహరికోట (సూళ్లూరుపేట): నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలార్ ఉపగ్రహ వాహక నౌక-సీ39 (పీఎస్‌ఎల్వీ) ప్రయోగం విఫలమైంది. 29 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ అనంతరం గురువారం సాయంత్రం సరిగ్గా 7 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ నుంచి ఉష్ణకవచం వేరుపడలేదు. దీంతో ప్రయోగం విఫలమమైందని ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్ ప్రకటించారు.నింగిలోకి దూసుకెళ్లి మూడు దశల్లో విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ సీ-39 సాంకేతిక లోపంతో నాలుగో దశలో విఫలమైంది. ఉష్ణకవచంలోనే శాటిలైట్ ఉండిపోయిందనీ, సవిూక్ష అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మెన్ కిరణ్ కుమార్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం రాత్రి 7 గంటలకు ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ?39 రాకెట్ ద్వారా ప్రయోగించారు. బుధవారం రాకెట్ నాలుగో దశలో ద్రవ ఇంధనం నింపిన శాస్త్రవేత్తలు, గురువారం రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపారు. అనంతరం రాకెట్‌కు తుదివిడత తనిఖీలు నిర్వహించి హీలియం, నైట్రోజన్ గ్యాస్ నింపే పనులను పూర్తి చేశారు.రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి పీఎస్‌ఎల్‌వీ సీ39 ద్వారా 1,425 కిలోల బరువైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్1హెచ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. ఈ ప్రయోగంతో దేశానికి సొంత నావిగేషనల్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇందులో 2013లో పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ ఉపగ్రహంలోని మూడు పరమాణు గడియారాలు మొరాయించి సేవలందడం లేదు. దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్‌ను పంపేందుకు ఉద్దేశించిన రాకెట్ ప్రయోగం విఫలమైంది.




