
ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ, భాజపాలకు గవర్నర్ ఆహ్వానం
శ్రీనగర్ ,డిసెంబర్26(): జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీల్లో సమాలోచనలు సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు రావాల్సిందిగా అధిక స్థానాలు గెలుచుకున్న భాజపా, పీడీపీలకు ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా లేఖ రాశారు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు పీడీపీ ముందుకొస్తే ఆ పార్టీకి మద్దతిస్తామని ఎన్‌సీ ప్రకటించింది. దీంతో జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో రాజకీయ సవిూకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు బీజేపీకి మద్దతు ఇస్తోందనుకున్న నేషనల్ కాన్ఫరెన్స్.. ఉన్నట్టుండి ఇప్పుడు పీడీపీకి మద్దతిస్తామని ముందుకొచ్చింది. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ లేఖ రాసినట్టు పీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని జమ్మూ కశ్మీర్ ఆపధర్మ ముఖ్యమంత్రి, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. పీడీపీకి మద్దతుపై అధికారికంగా లేఖ రాయలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ ముందుకొస్తే మద్దతిస్తామని మాత్రమే చెప్పినట్టు ఆయన తెలిపారు. 87 స్థానాలున్న జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో పీడీపీ 28 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీతో అధికారాన్ని పంచుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ కేవలం 15 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. పీడీపీకి ఇప్పటికే 28 స్థానాలు ఉండటంతో నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతిస్తే వారి బలం 43 అవుతుంది. కానీ, కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన సాధారణ మెజారిటీ 44. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచినా, వాళ్లలో అత్యధికులు బీజేపీ రెబల్సే. వాళ్లు బీజేపీ నేతృత్వంలోని సర్కారుకు మద్దతివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో పీడీపీ – నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.




