Monday, 2 November 2026

పుష్కరునికి వీడ్కోలు

C

– ఘనంగా ముగిసిన పుష్కరాలు

హైదరాబాద్‌,జులై25(జనంసాక్షి):

అత్యంత వైభవంగా ప్రజలను 12 రోజులపాటు అలరించిన గోదావరి మహా పుష్కరాలు ఘనంగా ముగిశాయి. గోదావరి తల్లికి ఘనంగా హారతి ఇచ్చిన తెలుగు ప్రజలు కృతజ్ఞతలు చాటుకున్నారు. వేదోక్తంగా పూజలు నిర్వహించి మహా హారతితో పుష్కరాలకు పూర్ణాహుతి పలికారు. భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం,మంగపేట, పోచంపాడుల వద్ద మంగళకరంగా మేళతాళాల మధ్య ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు పాల్గొని గోదావరి తల్లికి హారతి పట్టారు. అత్యంత ఉత్సాహభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొని కృతజ్ఞత చాటారు. గోదావరి మహా పుష్కరాల ముగింపు సందర్భంగా నిత్య హారతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. గోదావరిలో వదిలిన దీపాలు, బాణసంచా వెలుగులతో నదీ తీరం దేదీప్యమానంగా కాంతులీనింది.  ఈ సందర్భంగా పుష్కరాలు సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలావుంటే సాయంత్రం పుష్కర ఘడియలు ముగియడంతో పుష్కర స్నాన ఘట్టంలో పోలీసులు పుణ్యస్నానాలు నిలిపివేశారు. పుష్కరాలు చివరి రోజు కావడంతో పుష్కర ఘాట్‌ భక్తులతో కిక్కిరిసింది. పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇక తెలంగాణలో అత్యంత వైభవంగా పలుచోట్ల గోదావరి మాతకు పుష్కర హారతి సమర్పించడం ద్వారా ముగింపు పలికారు. వివిధ ప్రాంతాల్లో మంత్రులు, స్వాములు పాల్గొన్నారు. ప్రధాన హారతి కార్యక్రమం ధర్మపురి పుణ్యక్షేత్రంలో నిర్వహించారు. ఇక్కడ పీఠాధిపతుల సమక్షంలో గోదావరి హారతి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోఛ్చారణ మధ్య హారతి అందించారు. ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, కలెక్టర్‌ నీతూప్రసాద్‌ ,పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరంలో గోదావరి మహా పుష్కరాలు ముగిశాయి. శనివారం సాయంత్రం వేద పండితులు గోదావరికి హారతి ఇవ్వడంతో పుష్కరాలు ముగిసినట్లు తెలిపారు. ఇక్కడ స్పీకర్‌ మధుసూధనాచారి శాస్తోక్త్రంగా, వేదోక్తంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఆలయం నుంచి గోదావరి నది వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం స్పీకర్‌ గోదావరి నదికి  మహా హారతి ఇచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో జరుగుతున్న ముగింపు ఉత్సవాలకు మంత్రులు  ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న పాల్గొన్నారు. గోదావరి తీరంలో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసర సరస్వతి ఆలయం నుంచి పుష్కర శోభాయాత్ర చేపట్టారు. ఈ యాత్రలో మంత్రులు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న తదితరులు పాల్గొన్నారు.  నిజామాబాద్‌ జిల్లా త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భద్రాచాలంలో ఘనంగా జరిగిన పుష్కర హారతి కార్యక్రమంలో మంత్రి తుమ్మల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *