Monday, 2 November 2026

పుస్తకాలతో నిరుద్యోగుల కుస్తీలు…

rbunl1d5హైదరాబాద్ : నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్స్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. సర్కారీ కొలువుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఆనందోత్సాహం వెల్లివిరిస్తోంది. ఒక్కసారిగా వారి దృష్టి మళ్లీ చదువులపైకి మళ్లింది. లైబ్రరీలు, పార్కులు, ఖాళీ ప్రదేశాలు ఇలా ఎక్కడ చూసినా పోటీపరీక్షలకు కసరత్తు చేసే నిరుద్యోగులే కన్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ సర్కారీ కొలువుల జాతర మొదలైంది. పోటీపరీక్షలకు నోటిఫికేషన్స్‌ ఎప్పుడెప్పుడు పడతాయా అని ఇన్నాళ్లూ ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. దీంతో నిరుద్యోగులు మళ్లీ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇన్నాళ్లు పుస్తకాలను అటకెక్కించిన విద్యార్థులు మళ్లీ పుస్తకాల బూజు దులుపుతూ చదువుల్లో మునిగితేలున్నారు.
ఆగస్టు తొలివారంలో నొటిఫకేషన్..
ఆగస్టు తొలివారంలో మొదటి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముంది. మొత్తం 15,522 పోస్టులను మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందులో పోలీసు, అగ్నిమాపక శాఖల్లో 8 వేల పోస్టులు, విద్యుత్‌ శాఖలో 2,681 పోస్టులు, పంచాయతీరాజ్‌, ఇతర శాఖల్లో కలిపి 4,841 వరకు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వెలువడే తొలి నోటిఫికేషన్‌ కోసం నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మొత్తం పోస్టులు 15,522…
మరో వారం పదిరోజుల్లో ఉద్యోగాల నోటిఫికేషన్స్ వెలువడనుండడంతో నిరుద్యోగులంతా ఇప్పుడు కోచింగ్‌ సెంటర్లలో చేరుతున్నారు. హైదరాబాద్‌ సహా జిల్లా కేంద్రాల్లోని కోచింగ్‌ సెంటర్లకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లన్నీ విద్యార్థులతో కిటకిటటలాడుతున్నాయి. పుస్తకాలు, కుర్చీలు పట్టుకొని చెట్టునీడ కోసం పరుగెడుతున్నారు. ఈ సంవత్సరం జరిగే పోటీపరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో..అభ్యర్దులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అభ్యర్థులు మాత్రం..వయో పరిమితి పెంపుపట్ల నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఇదే అదనుగా భావించి అభ్యర్థుల నుంచి వేలల్లో ఫీజుల్ని వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగినా…మీ ఇష్టం అయితే చేరండి లేకపోతే వేరే కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లండి అంటూ సమాధానం చెప్తున్నారు. దీంతో నిరుపేద అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *