ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఉన్నతాధికారులతో కలిసి జిల్లాలోని ప్రాజెక్టుల స్టేటస్‌పై సమీక్ష నిర్వహించారు. లాస్ట్ వీక్ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్వయంగా జిల్లాలో పర్యటించారు. జిల్లా మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, పెన్‌గంగ ప్రాజెక్టుపై నిర్మించతలపెట్టిన మూడు బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు.
జిల్లాలో 6 లక్షల 50 వేల హెక్టార్లల్లో పంటలు సాగు అవుతున్నాయి. ఇందులో 80శాతంకు పైగా పంటలను వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. దీంతో ప్రతీ ఏడాది వర్షాలు సక్రమంగా కురువగా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
గత ప్రభుత్వం హయంలో జిల్లాలో జలయజ్ఞం పథకం కింద 7 మధ్యతరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2005లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు.
జిల్లాలో మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు లతో పాటు, భారీ తరహా సాగు నీటి ప్రాజెక్టు కింద చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో వేలాది ఎకరాలకు సాగు నీరు అందాలి. అయితే గడిచిన 9 సంవత్సరాలలో వేల కొట్ల నిధులు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేసిన ప్రభుత్వం జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా సాగు నీటి ని అందించలేకపోయింది. అయితే ప్రాజెక్టులు పూర్తిచేయకుండా అప్పటి సీమాంద్ర ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేసి పంట పొలాలకు సాగు నీరు అందించాలన్న గత ప్రభుత్వం లక్ష్యం మాత్రం నెరవేర్చలేకపోయింది. జిల్లాలో మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులైన నీల్వాయి, ర్యాలీవాగు, గొల్లవాగు, పెద్దవాగు, కొమురంభీం, మత్తడి తదితర ప్రాజెక్టులు 2005 లోనే మంజూరయ్యాయి. నిబందనల ప్రకారం 2007 లోనే పూర్తి కావాలి. అటవీశాఖ అనుమతులు, నిధులు సకాలంలో మంజూరు చేయకపోవడంతో నిర్మాణంలో జాప్యం జరిగింది. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 5 లక్షల 25 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతుంది. టిఅర్ఎస్ ప్రభుత్వం హామి ఇచ్చిన ప్రకారం మరో 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉంది. మంచిర్యాల మండలం ముల్కల గ్రామ పరిధిలో నిర్మించిన ర్యాలీ వాగు ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలు, జైపూర్ మండలం భీమారం లోని గొల్లవాగు తో 9 వేల 5 వందలు, వేమన పల్లి మండలంలోని నీల్వాయి గ్రామ సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టు ద్వారా 13 వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంది. ఆసిఫాబాద్ మండలంలోని ఆడ గ్రామ సమీపంలో కొమురంభీం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 45 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. కాగజ్ నగర్ మండలం లోని జగన్నాథపూర్ గ్రామ సమీపంలో పెద్దవాగు పై నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టు పూర్తయితే 15 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. వీటితో పాటు తాంసీ మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు పూర్తయినప్పటికీ కాలువలు నిర్మించలేదు. కాలువలు నిర్మిస్తే 13 వేల ఎకరాలకు, అలాగే సాత్నాల ప్రాజెక్టు కాలువలు నిర్మాణం పూర్తయితే 24 వేల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉంది. ఇక శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులలో భాగంగా 2 వ దశ,వరద కాలువ నిర్మాణం పనులు పూర్తి కావాల్సి ఉంది.. దీంతో పాటు జిల్లాలో లక్షా 67 వేల ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాణ హిత చేవెళ్ల ప్రాజెక్టును 2008 లో ప్రారంభించనప్పటికీ కేవలం ఈ ప్రాజెక్టు శిలాఫలకానికే పరిమితం అయ్యింది. ముదోల్ నియోజకవర్గంలోని బైంసా సమీపంలో నిర్మించిన గడ్డెన్న వాగు ప్రాజెక్టు కాలువలు పూర్తయితే 14 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఇక 32 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న పెన్ గంగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. ఇక సాదర్ మాట్ ప్రాజెక్టు ఆదునీకరణ, కడెం ప్రాజెక్టు కాల్వల ఆదునీకరణన, స్వర్ణ ప్రాజెక్టు ఆదునీకరణ పనులు జరిగాల్సి ఉంది. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా మరో 50 వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందే అవకాశం ఉంది. జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ టిఅర్ఎస్ ప్రభుత్వం మాత్రం జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా చిత్త శుద్దితో అమలు చేస్తుంది., దీంతో పాటు పెన్ గంగ పై మూడు బ్యారేజీల నిర్మాణానికి ఇప్పటికే 1227 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించడంతో వెంటనే పెన్ గంగ పై ఈ మూడు బ్యారేజీలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.మరో వైపు కుప్టి ప్రాజెక్టును కూడా సర్వే పూర్తయిన వెంటనే యుద్ద ప్రాతిపదికన నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. దీంతో పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టుల ద్వారా దాదాపు జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. మొత్తానికి ప్రాజెక్టుల నిర్మాణం పై ప్రభుత్వం ద్రుష్టి సారించడంతో సాగు నీరు అందడం మరెంతో దూరం లేదన్న ఆనందోత్సవాలు రైతులలో వ్యక్తం అవుతున్నాయి.
గత వారం అదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు రెండు రోజలు పర్యటన జిల్లా రైతాంగంలో కొత్త ఆశలను చిగురింపజేసాయి. దీంతో కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లా లో పెండింగ్ లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి అవుతాయని, తద్వారా తమ పంట పొలాలకు సాగు నీరు అంది బంగారు పంటలను పండిస్తామని జిల్లా రైతాంగం ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్




