పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

– యూఏఈ పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌,ఆగష్టు 11(జనంసాక్షి): తెలంగాణలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, యూఏఈ ఎక్స్‌ చేంజ్‌ చైర్మన్‌ బీఆర్‌ శెట్టి అంగీకరించారు. శుక్రవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ తో యూఏఈ ఎక్స్‌ చేంజ్‌ చైర్మన్‌ బీఆర్‌ శెట్టి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ, మెడికల్‌ డివైసెస్‌ పార్కుల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. హైదారాబాద్‌ నగరం బల్క్‌ డ్రగ్‌ రాజధానిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే లైఫ్‌ సైన్సెస్‌, ఏరోస్పెస్‌ రంగాల్లోనూ అధికంగా పెట్టబుడులు వస్తున్నాయని తెలిపారు. దీనిపై బీఆర్‌ శెట్టి సానుకూలంగా స్పందించారు. తాము ఫార్మాసిటీ, మెడికల్‌ డివైసెస్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తామన్నారు. అలాగే హెల్త్‌ కేర్‌ రంగంలోనూ తమకు ఆసక్తి ఉన్నదని బీఆర్‌ శెట్టి ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. తెలంగాణ గురించి తనకు చాలా మంది ఇప్పటికే అనేక మంచి విషయాలు చెప్పారన్నారు. తాజాగా మంత్రిని కలిసి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గురించి స్వయంగా తెలుసుకున్నామని అన్నారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు అవసరం అయితే తాను స్వయంగా సహాకరిస్తానని కేటీఆర్‌ చెప్పారు. ఈ మేరకు దుబాయ్‌, అబుదాబిల్లోని పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. తెలంగాణలో తమ సంస్ధ తరపున సామాజిక సేవా కార్యక్రమాలను సైతం చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని మంత్రిని బీఆర్‌ శెట్టి కోరారు. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. సమావేశం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీ, సింగిల్‌ విండో అనుమతులను బీఆర్‌ శెట్టికి వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ పాల్గొన్నారు.