హైదరాబాద్,మే24(జనం సాక్షి): మారిన పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతి రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. మారిన ధరలు ఆన్లైన్లోనే ఆయా బంకుల వద్ద పంపుల్లోకి నేరుగా వస్తాయి. ఈ ధరల మార్పిడి పక్రియ జరగడానికి కనీసం 10 నిముషాల వ్యవధి పడుతుంది. ఈ సమయంలో పంపులు పనిచేయవు. అయితే కొన్ని బంకుల్లో అర్థరాత్రి తరవాత ధరనలు సరిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పెట్రోలు బంకుల్లో తెలియని దోపిడి జరిగిపోతోంది. అర్థరాత్రి సమయంలో నగరంలోని పెట్రోలు బంకుల సిబ్బంది పాల్పడుతున్న అక్రమాలతో వినియోగదారులు విలవిలలాడుతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ మారుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు అర్థరాత్రి 12 గంటలకు దేశంలోని అన్ని పెట్రోలు బంకుల్లోని పంపులు కాసేపు ఆగిపోతాయి. ఆయా పెట్రోలు కంపెనీలు డేటా తీసుకున్న సేకరించిన తరువాత పంపులు యథావిధిగా పనిచేస్తాయి. మారిన ధరలను పంపుల్లో ఫీడ్ చేసిన తరువాత పెట్రోలు, డీజిల్ విక్రయాలు ప్రారంభించాలి. సరిగ్గా అర్థరాత్రి 12 నుంచి 12.30 గంటల వరకూ నగరంలోని చాలా బంకుల్లో మారిన ధరలను ఫీడ్ చేయడం లేదు. ఇదే సమయంలో బంకులకు వచ్చే వాహన చోదకులు పెట్రోలు, డీజిల్ కావాలని కోరితే, కొంత సమయం వేచి ఉండమంటున్నారు. అలా వేచి ఉండే సమయం లేని వారికి పెట్రోలు, డీజిల్ విక్రయిస్తున్నారు. ఇలా బంకుల్లో సిబ్బంది తమ ఇష్టారాజ్యంగా డబ్బులు దండుకుంటున్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. ఆటోమెటిక్‌గా ధరలు మారేలా చూడాలన్నారు. వాహనదారుల హడావిడిని క్యాష్ చేసుకుంటున్నవ ఆరిపై చర్య తీసుకోవాలన్నారు.
పెట్రోల్ బంకుల ధరల సూచీలో అలసత్వం




