Thursday, 5 November 2026

పెరగనున్న వ్యవసాయ విస్తీర్ణం

హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తెలంగాణ ఏర్పడ్డాకే తొలిసారిగా రికార్డుస్థాయిలో సాగు చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలతో సర్కారు సన్నద్ధమైనది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు ఈ వానాకాలంలో భారీ సాగు లక్ష్యాన్ని నిర్దేశించింది. గతేడాదికంటే 6లక్షల ఎకరాలు అదనంగా చేర్చుతూ సాగు చేయించాలని వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందించారు.వానలు కురుస్తుండటంతో రైతులు పొలంబాట పట్టారు. మరోవైపు నైరుతి సోమ, మంగళవారాల్లో రాష్ట్రాన్ని తాకనున్నది. బంగాళాఖాతంలోని అల్పపీడనం కూడా తీవ్ర అల్పపీడనంగా మారింది. పలుచోట్ల భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలాప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో విస్తరించాయని, తెలంగాణ వైపు చురుకుగా కదులుతున్నాయని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వానలు మరింత పెరుగుతాయని చెప్పారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయి రాత్రివేళల్లో చలిగాలుల తీవ్రత పెరుగుతున్నది.