Friday, 6 November 2026

పెళ్లిళ్లకు కుదిరిన ముహుర్తాలు

నెల రోజుల విరామం తర్వాత మళ్లీ సందడి

పురోహితులకూ పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి): గత నెలరోజుల విరామానికి తెరపడింది. మూఢం తొలగడంతో మళ్లీ మంచి ముహూర్తాలతో పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కాబోతున్నది. ఈ నెల 21తో మూఢం పోతున్నదని పండితులు చెబుతున్నారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 17 వరకు పెళ్లిళ్లకు దివ్యమైన ముహుర్తాలు వుండడంతో సందడి నెలకొంది. నెల 22 నుంచి జూలై 7 వరకు దివ్యమైన ముహూర్తాలు ఉండడంతో వేలాది జంటలు ఈ గడువులోనే వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే కొన్నిచోఎట్ల 21 నుంచే ముహూర్తాలను పెట్టేశారు. హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో 21న చాలా పెళ్లిళ్లు ఉన్నాయి. మే 3వ తేదీ నుంచి జూన్‌ 13 వరకు అధిక జేష్టమాసమని ముహూర్తాలు లేకుండా పోయాయి. 14 నుంచి నిజ జేష్టమాసం ఆరంభమై వచ్చేనెల 13 వరకు కొనసాగుతోంది. ఈ నెల రోజుల పాటు ముహూర్తాలు ఉండడంతో పండితులకు మంచి డిమాండ్‌ వచ్చేసింది. ఆపై జూలై 14 నుంచి ఆగస్టు 11 వరకు ఆషాడమాసం వస్తుండడంతో దాదాపు ఆ మధ్యకాలంలో ఎలాంటి ముహూర్తాలు ఉండవని పండితులు పేర్కొంటున్నారు. మంచి ముహుర్తం కోసం ఎదురు చూసిన వారు ఆరు నెలల క్రితమే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధానంగా మ్యారేజ్‌ హాళ్లను బుకింగ్‌ చేసుకున్నారు. దీంతో నెల రోజుల తర్వాత పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. భారీగా ఫంక్షన్‌ హాళ్లు బుకింగ్‌ చేసుకున్నారు. పెళ్లిళ్లు ఇప్పటికే ఖరారు కావడంతో పాటు, హాళ్లు కూడా ఎప్పుడో బుకింగ్‌ కావడంతో ఇప్పటికిప్పుడు హాళ్లు దొరకడం గగనమే. దీనికితోడు ¬టళ్ల సంఖ్య పెరుగుతుండడంతో ఫంక్షన్‌హాళ్లకు బదులు అక్కడా ప్రయత్నించినా దొరకడంగగనంగా మారింది. అందుకే చాలా మంది ముందస్తుగానే బుకింగ్‌ చేసుకున్నారు. ఇక వాయిద్యకారులకు, క్యాటరింగ్‌ కోసం పరుగులు తప్పడం లేదు. మరో వైపు పురోహితులకు డిమాండ్‌ పెరిగింది. ఈ సీజన్‌లో పెళ్లిళ్లు అధికంగా ఉండడంతో పురోహితులకు కూడా డిమాండ్‌ పెరిగింది. హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా పురోహితులకు యమ డిమాండ్‌ వచ్చేసింది. అన్ని జిల్లాల్లోనూ ఈ నెల రోజుల పాటు ముహూర్తాలతో నూతనంగా వధూవరులు కాబోతున్న వారి కుటుంబాలు ఆరు నెలల క్రితం నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా బంగారం ధర కొంత తగ్గడంతో ఇంకా హెచ్చుతగ్గుల అవకాశాలపై ఆరాతీస్తున్నారు. అంతే కాదు పెళ్లి తంతు నిర్వహించడానికి వేదికలైన షామియానాలు, ఫంక్షన్‌హాళ్లతో పాటు వాహనాలు, క్యాటరింగ్‌, వాయిద్య కళాకారులు, ఫొటోగ్రాఫర్‌లు, వివాహ మండపాలు వేసే వారిని అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుత నిజ జేష్టమాసంలో వచ్చే జూలై 13 వరకు అంటే సుమారు నెల రోజుల పాటు వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు, ఇతరత్రా వాటికి ముహూర్తాలు బాగున్నాయి. ఆపై ఆషాడమాసంలో ఎలాంటి ముహూర్తాలు ఉండవు. తిరిగి ఆగస్టు 11 తర్వాత శ్రావణమాసంలోనే ముహూర్తాలు ఉంటాయి. ఈ నెలరోజులు సందడి కనిపించనుంది.