పేస్‌బుక్‌లో ఎద్దేవా చేసిన విజయసాయి
అమరావతి,నవంబర్13(జనంసాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు అసహ్యంగా ఉందని, ఆయన చేపట్టిన పథకాలపై వైసీపీ నేత, పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, చేపట్టిన పథకాలపై ఈ రోజు ఫేస్ బుక్ లో విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. రెయిన్ గన్లను పట్టుకుని చంద్రబాబు రాయలసీమలో కరువును కంటికి కనిపించకుండా చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ తర్వాత ఏపీలో ఒక్క దోమ కూడా కనిపించడం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో ఏకంగా సముద్రాలను కంట్రోల్ చేసేశారని కితాబిచ్చారు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టిన చంద్రబాబు పేపర్లకు ఎక్కారని వెటకారమాడారు. ఈరోజు విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. ‘రెయిన్ గన్ పట్టుకుని సీమలో కరువు కంటికి కనిపించకుండా తరిమికొట్టాడు. దండయాత్రతో దోమలపై సంహారం చేసి దోమ కనిపించకుండా చేశాడు. టెక్నాలజీతో సముద్రాలను కంట్రోల్ చేశాడు. తుపాన్లను ఒంటి చేత్తో ఆపేశాడు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టి పేపర్లకు ఎక్కాడు నాయుడుబాబు’ అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.




