Thursday, 5 November 2026

పేదలే  తెదేపా కులం

– వారి అభివృద్ధిని అన్ని విధాల కృషి
– కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఏపీని నిర్లక్ష్యం చేస్తుంది
– కేంద్రం మోసాన్ని ఎండగట్టేందుకే బీజేపీయేతర పక్షాలతో కలుస్తున్నాం
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
విజయవాడ, నవంబర్‌12(జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీకి కులం, మతం లేదని.. పేదలే తమ కులమని మఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సోమవారం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆదరణ-2 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ ప్రపంచీకరణ కారణంగా చేతి వృత్తులవారు వెనుకబడ్డారని అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఐవీఆర్‌ఎస్‌ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. కాపుల్లో పేదవారిని గుర్తించి సబ్సిడిపై రుణాలు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును నక్సలైట్లు అన్యాయంగా చంపారని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. కిడారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. మైనారిటీలకు మూడు ప్రధాన శాఖలు ఇచ్చి గౌరవించామని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆంధప్రదేశ్‌కి సాయం చేయడం లేదని చంద్రబాబు విమర్శించారు. తితలీ తుపాను బాధితులకు పూర్తిస్థాయి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. నరేంద్రమోదీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, స్వతంత్రవ్యవస్థలను రాజకీయంగా వాడుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రశ్నించినవారిపై సీబిఐ, ఐటీ పేరుతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం చేసిన మోసాన్ని తెలియజేసేందుకే బీజేపీయేతర పక్షాలను కలుస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. నోట్ల రద్దుతో ఏం సాధించారో కేంద్ర పెద్దలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. జీఎస్టీతో ధరలు మరింత పెరిగిపోయాయన్నారు.