Tuesday, 3 November 2026

పేదల సంక్షేమం కోసమే ఆసరా

7అర్హులను గుర్తిస్తున్నాం : సీఎం కేసీఆర్‌

చర్చకు పట్టుబట్టిన జానా

హైదరాబాద్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) : పేదల సక్షేమం, భద్రత కోసమే ఆసరా పథకం ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు వెల్లడించారు. అర్షులను గుర్తిస్తున్నామని వివరించారు. ఈ అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత జానారెడ్డి చర్చకు పట్టుబట్టారు. గతంలో ఇచ్చిన పింఛన్లు కనీస అవసరాలు తీర్చలేదని, పేదలు గౌరవంగా బతికేందుకే తాము పింఛన్ల మొత్తాన్ని పెంచి అందిస్తున్నామని సీఎం చెప్పారు. పింఛన్లపై పూర్తి స్థాయి చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు పింఛన్లపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేశారు. అర్హులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో లబ్ధిదారుల నుంచి 39.63 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఇప్పటివరకు 24.21 లక్షల మంది అర్హులను గుర్తించినట్లు వెల్లడించారు. ఆసరా పింఛన్ల పంపిణీకి సుమారు రూ.3,350 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ఖర్చుకు వెనకాడకుండా ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రారంభించిందని వెల్లడించారు. గతంలో ఇచ్చిన పింఛన్లు కనీస అవసరాలు తీర్చలేదని, పేదల భద్రత, సురక్షిత జీవితం కోసమే ఆసరా పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం పింఛన్లు ఇస్తోందని వివరించారు. తమది పేదల ప్రభుత్వమని.. పింఛన్లపై చర్చ జరపకుండా ప్రభుత్వం పారిపోతుందనడం సరికాదన్నారు. గతంలో పింఛన్ల కోసం ఏడాదికి రూ.800 కోట్లు ఖర్చుచేస్తే.. తమ ప్రభుత్వం రూ.3350 కోట్లు వెచ్చిస్తుందని వివరించారు. అంతకు ముందు శాసనసభలో మూడో రోజు కూడా గందరగోళం కొనసాగింది. బుధవారం ఉదయం శాసనసభ ప్రారంభంకాగానే స్పీకర్‌ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే, ప్రశ్నోత్తరాలు రద్దుచేసి, తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. పింఛన్లు అందక వృద్ధుల బలవన్మరణాలపై చర్చ చేపట్టాలని ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పింఛన్లపై చర్చ చేపట్టాలని సభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. పోడియంలోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ప్రజా సమస్యలపై చర్చించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నదని తెలిపారు. చర్చ జరిగితే కాంగ్రెస్‌ బండారం బయటపడుతుందనే చర్చను అడ్డుకుంటున్నారన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే పోడియంలోకి వచ్చి సభకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పారు. సభా సమయం వృథా చేయొద్దని, సభ గౌరవం, హుందాతనాన్ని కాపాడాలని సూచించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను విరమించలేదు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభాపతి పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం కాంగ్రెస్‌ ఆందోళన కొనసాగించింది. పోడియంలోకి దూసుకెళ్లి తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. దీంతో మళ్లీ గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. గౌరవ సబ్యులు సభకు పదేపదే అంతరాయం కలిగించడం సరికాదన్నారు. ఆసరా పథకంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినప్పటికీ సభకు అంతరాయం కలిగించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల వివరాలను సభ ముందు ఉంచుతామన్నారు. సభను అడ్డుకొనేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చకు రావాలని సూచించారు. అయినప్పటికీ ప్రతిపక్షం ఆందోళన విరమించలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకుంటూ.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నదని తెలిపారు ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం సస్పెన్షన్‌ చేయించుకోవాలనే సభకు వచ్చినట్లు ఉందన్నారు. సభను అడ్డుకోవడం సరికాదని, ఉద్దేశ్యవపూర్వకంగా కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. అంతకు ముందు ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత పింఛన్ల అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టాలని కోరారు. కేబీఆర్‌ పార్క్‌ వద్ద జరిగిన కాల్పుల ఘటనపై సీఎం ప్రకటన చేయాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఆసరా పథకంపై గురువారం మధ్యాహ్నం చర్చిద్దామని తెలిపారు. అలాగే, కేబీఆర్‌ పార్కు కాల్పుల ఘటనపై ప్రకటన చేస్తామని చెప్పడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన విరమించారు.

ప్రభుత్వానికి నిరంకుశ వైఖరి: డీకే అరుణ

అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇచ్చే వరకు ప్రభుత్వంపై పోరాడతామని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ స్పష్టంచేశారు. ప్రభుత్వ నిబంధనల వల్ల అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదని విమర్శించారు. పింఛన్లు అందక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. బుధవారం శాసనసభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీలోని విూడియా పాయింట్‌ వద్ద అరుణ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్వాకం వల్లే అనేక మంది వృద్ధులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పిన్షన్లు రావేమో అని వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పెన్షన్ల కోసం మళ్లీ అందరినీ దరఖాస్తు చేసుకోవాలనడం పేద వృద్ధులు, వికలాంగులను ఇబ్బంది పెట్టడమేనని విమర్శించారు. సమగ్ర సర్వే పేరుతో ఇప్పటికే అన్ని వివరాలు సేకరించారని, మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని కోరడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. పింఛన్లపై సభలో వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అధికార పక్షం సభలో నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పింఛన్లు అందని పరిస్థితిపై అసెంబ్లీలో చర్చించాలని తీర్మానం ఇస్తే సభను కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని అధికార పక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తమకు ఏవిూ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *