వైద్య వ్యవస్థలో కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు
రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించాం
కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
నారాయణగూడెలో డయాగ్నోస్టిక్స్ సెంట్రల్‌ను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్, జూన్9(జనం సాక్షి ) : పైసా ఖర్చు లేకుండానే పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ మేరకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. నారాయణగూడలో ఐపీఎం క్యాంపస్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్‌ను మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మంత్రులకు వైద్య పరికరాల గురించి డాక్టర్లు వివరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో ఉచితంగా 53రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వైద్య వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించాం. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 40-50శాతం పెరిగింది. పట్టణంలోని పేదవారి కోసం బస్తీ దవాఖానాలు ప్రారంభించాం. ప్రస్తుతం 17 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయి. మనదేశంలో వైద్య వ్యవస్థ చాలా ఖర్చుతో కూడుకున్నది. సామాన్యులకు పైసా ఖర్చుకాకుండా తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో పరీక్షలు ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకోవచ్చని కేటీఆర్ తెలిపారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..ఈరోజు తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. కేసీఆర్ వినూత్న ఆలోచనలతో పాటు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.




