Tuesday, 3 November 2026

పొన్నాలా !.. ఓ ఐటీ పరిశ్రమ తెచ్చావా ?

5
మతిభ్రమించి మాట్లాడుతున్నావ్‌

మంత్రి హరీశ్‌ ఫైర్‌

హైదరాబాద్‌ జనవరి13(జనంసాక్షి): భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కూడా పొన్నాల తన స్వంత నియోజకవర్గం జనగామకు నీళ్లు తెచ్చుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. ఐటీ మంత్రిగా ఉండి ఒక్క ఐటీ కంపెనీని కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. కాకతీయ ఉత్సవాలకు ఒక్క పైసా కూడా విడుదల చేయించలేని ఘన చరిత్ర పొన్నాలదని హరీష్‌రావు ధ్వజమెత్తారు. తన పదేళ్ల మంత్రి పదవి కాలంలో ఒక్కనాడైనా ప్రజల కోసం పనిచేశారా? అని నిలదీశారు. ప్రజల ఛీత్కారానికి గురైనా ఇంకా సోయిరాలేదని మండిపడ్డారు. ఉద్యమకాలంలో విద్యార్థులను కొట్టించిన చరిత్ర పొన్నాలది కాదా? అని నిలదీశారు. విద్యార్థులను రాక్షసుడిలా హింసించిన చరిత్ర పొన్నాల లక్ష్మయ్యది అని వివరించారు. అమరవీరుల కుటుంబాలను ఇప్పటికి కూడా పరామర్శించని పొన్నాల ఇప్పుడు ప్రభుత్వంపై బురదజల్లడం సరికాదని హితవు పలికారు.

రాష్ట్ర పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యపై రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని మండిపడ్డారు. ఉద్యమ కాలంలో సీఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా వరంగల్‌కు రాలేదని పొన్నాల అనడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ నేతగా కేసీఆర్‌ వరంగల్‌కు నాలుగు వందలసార్లు వెళ్లారని గుర్తు చేశారు. తాము కేసీఆర్‌తోపాటు రోజుల తరబడి వరంగల్‌లోని కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఉన్నామని తెలిపారు. పదేళ్లు మంత్రిగా ఉన్న పొన్నాల తన నియోజకవర్గంలో తిరగని గ్రామాల్లో కూడా సీఎం కేసీఆర్‌ పర్యటించారని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *