మనం జాగ్రత్త పడకుంటే అంతే సంగతులు
ప్రచారంలో సునీతా హెచ్చరిక
యాదాద్రిభువనగిరి,నవంబర్3(జనంసాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా నాయకుల పెత్తనం చెల్లదని ఆలేరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్తి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకుపెత్తనం అప్పగించడమే లక్ష్యంగా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని అన్నారు. కాంగ్రస్ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు మళ్లీ ఇక్కడ పెత్తనం కోసం యత్నిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు. యాదాద్రిలో పలు ప్రాంతాల్లో ఆమె ప్రాచారంలో పాల్గొన్నారు. తెలంగాణ కోసం తొలుత తన ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచగా భావించి రాజీనామా చేసి, ఉద్యమించిన ఘనత కెసిఆర్దన్నారు. తెలంగాణ కోసం ఇలా ఎన్నోమార్లు రాజీనామా చేసిన కెసిఆర్ తెలంగాణ సాధించడంతో పాటు అభివృద్ధి సాధ్యం చేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీల ప్రభుత్వాలను మనం ఇది వరకే చూశామని.. ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయన్నారు. ఆ పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడి మళ్లీ వెనుకబడి
పోతామన్నారు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలనే కాకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా వంటి మ్యానిఫెస్టోలో లేని పథకాలను కూడా ప్రజల కోసం అమలు చేశారన్నారు. ప్రజలకు మంచి చేసే పథకాలను మళ్లీ టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చా మన్నారు. టీఆర్ఎస్ పార్టీని మళ్లీ ఆశీర్వదిస్తే ఆసరా పింఛన్లను రూ.2016కు పెంచుతా మన్నారు. వికలాంగులకు రూ.3016 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3016 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.8వేలను రూ.10 వేలకు పెంచుతా మన్నారు. గత ఏడు దశాబ్దాల కాలంలో రాష్ట్రం వెనుకబాటుకు గురైతే సీఎం కేసీఆర్ నాలుగు సంవత్సరాల్లోనే సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని ఉదాసీన వైఖరి ప్రదర్శించవద్దన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




