పోలవరంపై తప్పిదాలను.. 

స్పీకర్‌ సమర్థిస్తున్నారు
– ప్రభుత్వం విూకు తప్పుడు సమాచారం ఇస్తుంది
– వాస్తవాలు పరిశీలన చేసుకోండి
– రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు
విజయవాడ, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : పోలవరంపై తప్పిదాలను స్పీకర్‌ స్థానంలో ఉండి కోడెల శివప్రసాద్‌ సమర్థిస్తున్నాడని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రాజ్యసభ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు హితవు పలికారు. బుధవారం స్పీకర్‌కు కేవీపీ లేఖరాశారు. గతంలో తాను వాస్తవాలు తెలుపుతూ కోడెలకు 28 ప్రశ్నలతో లేఖ రాశానని తెలిపారు. కానీ కోడెల అసత్యాలతో ఆ ప్రశ్నలకు బదులిచ్చారని వెల్లడించారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వ గణాంకాలే కోడెల చెబుతున్నారని  ధ్వజమెత్తారు. పోలవరంపై కోడెల సమాధానం ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తుందన్నారు. పోలవరం అంటే
హెడ్‌వర్క్స్‌ మాత్రమే కాదని, ఆ విషయం కోడెల తెలుసుకోవాలని కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై తప్పిదాలను స్పీకర్‌ సమర్ధిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విూకు తప్పుడు సమాచారం ఇస్తుందని, పరిశీలన చేసుకోండని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు అసత్యాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడని కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే చార్మినార్‌ కూడా తానే కట్టానని చెబుతాడని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్‌ అన్ని అనుమతులు ఇచ్చిందని, ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లిందీ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఎప్పటికి పోలవరం పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని  విమర్శించారు. పోలవరంపై చంద్రబాబు చెబుతున్న అవాస్తవాలు ఆయన తాత్కాలిక ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. బాబు కూడా పోలవరం ఘనత మాదేనని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం సాధించిన ఘనత ముమ్మాటికీ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. అయినా ఇప్పటి వరకూ ప్రభుత్వానికి పోలవరానికి పీఆర్‌-2 తెచ్చుకోవడం చేతకాలేదని విమర్శించారు. కొండవీటి వాగు అనేది డ్రైనేజీ అన్నారు. ఇప్పుడు దాన్ని కూడా ఇరిగిషన్‌ ప్రాజెక్టుగా చెబుతున్నారని కేపీవీ ఆరోపించారు.

తాజావార్తలు