Thursday, 5 November 2026

పోలవరం ప్రాజెక్టు పరిధిలోని.. పల్లెకారులకు పరిహారం చెల్లించాలి

– ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు
కాకినాడ, నవంబర్‌10(జ‌నంసాక్షి) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన జీవనోపాధి కోల్పోతున్న పల్లె కారులను ప్రాజెక్టు బాధితులుగా గుర్తించి వారికి ప్యాకేజీలు అమలు చేయాలని ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు డిమాండ్‌ చేశారు. శనివారం ఉభయగోదావరి జిల్లాల పల్లెకారులు ఆయన నివాసం వద్ద సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలలో కొండమొదలు గ్రామం నుండి రాజమండ్రి వరకు 60 వేల మంది పల్లెకారులు గోదావరి నదిపై చేపల వేట జీవనాధారంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. గత సంవత్సర కాలంగా గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అడ్డుకట్టవేసి నిలిపి వేయడం వలన, ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి నది తీరంలో కోట్లాది టన్నుల ఇసుక తరలించడం వలన గోదావరి నదిలో మత్స్య సంపద తగ్గిపోయి జీవన ఉపాధి కోల్పోయారని అన్నారు. తరతరాలుగా చేపల వేట వృత్తిగా జీవనోపాధి సాగిస్తున్న పల్లెకారులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన జీవన ఉపాధి కోల్పోయారని అన్నారు. గత సంవత్సర కాలంగా చేపలు దొరకక పోవడం వలన ఏ ఉపాధి లేక పల్లెకారులు కటిక దారిద్యాన్న్రి అనుభవిస్తున్నారన్నారని పేర్కొన్నారు. చదువు లేని వారు కావడం, చదువులు ఉన్న వారికి ఉద్యోగాలు లేకపోవడం వలన ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన ఉపాధి కోల్పోతున్న పల్లె కారులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్ట్‌ బాధితులుగా గుర్తించి, కుటుంబానికో ఉద్యోగం, జీవనభృతి చెల్లించి, ఇంటి స్థలం కేటాయించాలని ఎన్నోసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పడం జరిగిందన్నారు. ఈ విషయంపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కి పిటిషన్లు పెట్టడం జరిగిందన్నారు.