హైదరాబాద్,నవంబర్22(జనంసాక్షి): ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఇందులో బీఎల్‌ఓలు మాత్రమే కూర్చోవాలని, రాజకీయపార్టీల ఏజెంట్లు ఉండరాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ స్పష్టంచేశారు. పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తులను మాత్రమే సహాయకులుగా నియమించుకోవాలని బీఎల్‌ఓలకు దానకిషోర్ సూచించారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి ప్రతి నియోజకవర్గంలో రెండుచోప్పున మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఒకటి పూర్తిగా మహిళలకు కేటాయిస్తున్నామని ఆయన వివరించారు. ప్రతి ఓటరుకు పోల్ చిట్టీలు, ఓటరు గుర్తింపు కార్డులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. బూత్ లెవల్ అధికారుల(బీఎల్‌ఓ) ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి ఈ పక్రియ మొదలవుతుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో 3800మంది బీఎల్‌ఓలు ఈనెల 26వ తేదీనుంచి ఓటరు చిట్టీలు పంపిణీచేస్తారని చెప్పారు. 25వ తేదీన సూపర్‌వైజర్లు తమ పరిధిలోని పోలింగ్ లోకే షన్లలో బూత్ లెవల్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి పోల్ చిట్టీలు, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ వివరాలను అందజేయాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి పోల్‌చిట్టీలు పంచే సందర్భంగా మరణించిన, ఇల్లు మారిన, డబుల్ ఎంట్రీలున్న ఓటర్లను గుర్తించాలని సూచించారు. ఓటర్లందరికీ పోల్‌చిట్టీలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా వీఐపీలకు చిట్టీలు అందేవిధంగా చూడాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందించే కనీస మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేద దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.




